IND vs PAK: బుమ్రా లేదా షహీన్‌.. ఎవరు డేంజరస్‌? గంభీర్‌ మాత్రం ఆ పేసర్‌ వైపే!

వరల్డ్‌ కప్‌లో (ODI World Cup 2023) దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది. శనివారం అహ్మదాబాద్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది.

Published : 13 Oct 2023 11:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్: శనివారం క్రికెట్ అభిమానులకు పండగలాంటిది. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత మజా కలిగించే మ్యాచ్‌ జరగబోతోంది. వన్డే ప్రపంచకప్‌లో (ODI WC 2023) భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌కు (IND vs PAK) అహ్మదాబాద్‌లోని అతిపెద్ద స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ పేసర్ బుమ్రా (Bumrah), పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్ షహీన్‌ (Shaheen) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరిలో ఎవరు సత్తా చాటుతారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్ (Gautham Gambhir) ఇద్దరు పేసర్లలో అత్యంత ప్రమాదకరం ఎవరనే దానిపై విశ్లేషించాడు. బుమ్రా డేంజరస్‌ బౌలర్ అని.. షహీన్‌కు అతడికి చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నాడు.

‘‘ఆస్ట్రేలియాతో చెన్నై పిచ్‌ మీద మిచెల్‌ మార్ష్‌ను బుమ్రా ఔట్ చేసిన తీరు అద్భుతం. అలాగే అఫ్గాన్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జాద్రాన్‌ను కూడా అదే విధంగా బోల్తా కొట్టించాడు. అందుకే, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్‌గా బుమ్రానే ఎంపిక చేస్తా. ఇప్పుడు అంతా బుమ్రా - షహీన్‌ను పోలుస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. వారిద్దరి బౌలింగ్‌ విషయంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రతి దశలోనూ బంతితో అద్భుతాలు చేసే వారు చాలా అరుదుగా ఉంటారు. కొందరు కొత్త బంతితో అదరగొడతారు. మరికొందరు డెత్‌ ఓవర్లలో చెలరేగుతారు. అయితే, బుమ్రా అటు ఆరంభంలోనూ ఆ తర్వాత మిడిల్‌ ఓవర్లలోనూ తన ప్రభావం చూపించగలడు. బంతి కొత్తదా..? పాతదా..? అనేది అనవసరం. కానీ షహీన్‌లో ఈ లక్షణాలు కనిపించవు’’ అని గంభీర్‌ తెలిపాడు.

ఇప్పటికే భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) జట్లు అహ్మదాబాద్‌కు చేరుకుని ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. గత రెండు మ్యాచ్‌లకు దూరమైన భారత ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ కూడా అహ్మదాబాద్‌లో సాధన చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ కూడా అతడి పరిస్థితిని గమనించి పాక్‌తో మ్యాచ్‌లో ఆడించడంపై మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. ఇరుజట్లూ రెండేసి విజయాలతో కీలక పోరుకు సిద్ధమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని