ODI WC 2023: సెమీస్‌లో భారత్-పాక్‌? తలపడతాయా? దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్!

Updated : 02 Nov 2023 12:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగుతున్నాయి. టాప్‌ జట్లకూ షాక్‌లు తప్పడం లేదు. వరుసగా విజయాలు సాధించిన టీమ్‌లూ ఓటములను చవిచూస్తున్నాయి. అలాగే కీలక సమయాల్లో ఆటగాళ్లు దూరం కావడం కూడా ఆయా జట్లను ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి వరల్డ్‌ కప్‌ విశేషాలు మీ కోసం..

సెమీస్‌లో దాయాదుల పోరు.. ఇంగ్లాండ్‌ మాజీకి షోయబ్‌ సమాధానం

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్‌ వరుసగా విజయాలు సాధించి సెమీస్‌ రేసులో ముందుంది. మరోవైపు పాకిస్థాన్‌ ఓటములతో సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప పాక్‌ సెమీస్‌కు చేరుకోవడం కష్టమే. తర్వాతి రెండు మ్యాచుల్లో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌తో పాక్‌ తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్‌ వాన్‌ సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ‘‘భారత్-పాక్‌ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా సెమీస్‌.. ఎవరైనా చెప్పగలరా?’’ అని వాన్‌ సరదాగా పోస్టు చేశాడు. దీనికి పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌ స్పందించాడు. ‘‘గతంలోనూ ఇలాంటివే మా ఆశలను వమ్ముచేశాయి. నిన్ను కూడానూ’’ అంటూ నవ్వుతున్న ఎమోజీని ట్వీట్‌ చేశాడు.


దక్షిణాఫ్రికా సిక్స్‌ల రికార్డు

వన్డే ప్రపంచకప్‌లో అసాధారణ ఆటతీరుతో సెమీస్‌ రేసులో ముందున్న దక్షిణాఫ్రికా జట్టు తాజాగా న్యూజిలాండ్‌ను కూడా 190 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. క్వింటన్ డికాక్, వాన్‌డర్‌ డసెన్ సెంచరీలు బాదేశారు. ఇదే సమయంలో మరో అరుదైన రికార్డును దక్షిణాఫ్రికా తన ఖాతాలో వేసుకుంది. ఈ వరల్డ్‌ కప్‌లో ఇప్పటి వరకు సఫారీ జట్టు బ్యాటర్లు 82 సిక్స్‌లు కొట్టారు. దీంతో 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ పేరిట ఉన్న 76 సిక్స్‌ల రికార్డును దక్షిణాఫ్రికా అధిగమించింది. లీగ్‌ దశలోనే ఇంకా రెండుమ్యాచ్‌లతోపాటు సెమీస్‌లోనూ దక్షిణాఫ్రికా ఆడనుంది. దీంతో ఆ సిక్స్‌ల సంఖ్య సెంచరీ దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దక్షిణాఫ్రికా చేసిన 82 సిక్స్‌ల్లో డికాక్‌ 18, క్లాసెన్ 17, మిల్లర్ 14, మార్కో జాన్‌సెన్ 9, మార్‌క్రమ్ 8, వాన్‌డర్‌ డసెన్ 7 చొప్పున సిక్సర్లు బాదారు.


వరల్డ్‌ కప్‌లోని మిగతా మ్యాచ్‌లకు మిచెల్‌ మార్ష్ దూరం

కీలక దశలో ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వరల్డ్‌ కప్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరం కావడం గమనార్హం. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాల వల్ల మిచెల్‌మార్ష్ మెగా టోర్నీ దూరమైనట్లు మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ఇప్పటికే స్వదేశానికి వెళ్లిపోయాడని బోర్డు తెలిపింది. పాక్‌పై సెంచరీతో అలరించిన మార్ష్ మిగతా మ్యాచుల్లో పెద్దగా రాణించలేదు. మొత్తం 6 మ్యాచుల్లో 225 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ నవంబర్ 4న ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. గోల్ఫ్‌ కార్ట్‌ నుంచి కిందపడటంతో మ్యాక్స్‌వెల్‌ ముఖానికి గాయాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని