IPL 2024: ధోనీ - సచిన్‌ ఒక్కటే.. వీల్‌ఛైర్‌లో కూర్చోనైనా మహీ ఆడేస్తాడు: మాజీ క్రికెటర్లు

ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు.

Updated : 15 Mar 2024 12:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL 2024) 17వ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మార్చి 22న తొలి మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రాక్టీస్‌ ముమ్మరం చేశాడు. సీఎస్కేను ఆరోసారి విజేతగా నిలపాలనే ఉద్దేశంతో బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు అతడికిదే చివరి సీజన్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మాజీ క్రికెటర్లు ఓ చర్చా కార్యక్రమంలో అద్భుతమైన సమాధానం ఇచ్చారు.

ధోనీ ముందే రావడం శుభపరిణామం: సురేశ్‌ రైనా

‘‘కెప్టెన్ ఎంఎస్ ధోనీ టోర్నీ ప్రారంభానికి ముందే చెన్నైకు రావడం శుభ పరిణామం. కఠిన వాతావరణ పరిస్థితుల్లో నాలుగైదు గంటలపాటు సాధన చేయడం అద్భుతం. జిమ్‌లోనూ సమయం గడిపేస్తున్నాడు. ఇలాంటప్పుడే జట్టుతో చాలా అనుబంధం కలుగుతుంది. ఆటగాళ్లు కూడా స్వేచ్ఛగా సీనియర్లతో కలిసేందుకు అవకాశం ఉంటుంది’’ అని సీఎస్కే మాజీ ఆటగాడు సురేశ్‌ రైనా అన్నాడు.

వారిద్దరి మధ్య పోలికలు ఉన్నాయి: అనిల్ కుంబ్లే

‘‘నేను ధోనీతో కలిసి ఐపీఎల్‌లో ఆడలేదు. కానీ.. భారత జట్టుకు ఆడా. నన్ను ఒకసారి పైకి ఎత్తాడు. నాలాంటి బరువున్న వ్యక్తిని లేపాలంటే అతడు చాలా బలంగా ఉండాలి. టీమ్‌ఇండియా తరఫున నాకు అదొక అద్భుత క్షణం. నేను కోచ్‌గా ఉన్నప్పుడు ధోనీ కెప్టెన్సీ చేస్తున్నాడు. రాంచీ వేదికగా వన్డే మ్యాచ్‌ అనుకుంటా. ప్రాక్టీస్ సెషన్‌ ఏర్పాటు చేశాం. అది ఆప్షనల్‌. రాంచీ ధోనీ సొంతూరు. అతడు రావాల్సిన అవసరమే లేదు. కానీ, వచ్చాడు. ‘నువ్వేం చేస్తున్నావు? మన మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉంది’ అని అడిగా. ‘లేదు. నేను ఇక్కడ ఉండాలని భావించా’ అని సమాధానం ఇచ్చాడు. ఇలాంటి లక్షణమే సచిన్‌లోనూ గమనించా. దాదాపు పాతికేళ్లపాటు క్రికెట్ ఆడిన సచిన్‌.. ఆప్షనల్‌ రోజుల్లోనూ అందరికంటే ముందు బస్సులో ఉంటాడు. అందుకే, ధోనీ సీఎస్కే తరఫున కొనసాగడంపై నేను ఆశ్చర్యపోవడం లేదు. అతడికి ఆటపట్ల ఉన్న అభిరుచి ఆ స్థాయిలో ఉంటుంది’’ అని కుంబ్లే వ్యాఖ్యానించాడు.

ధోనీకి సీఎస్కే అలాంటి ఆఫర్ ఇస్తుంది: రాబిన్ ఉతప్ప

‘‘ఒకవేళ ధోనీ వీల్‌ఛైర్‌లో ఉన్నా సరే సీఎస్కే అతడికి ఆడేందుకు అవకాశం ఇస్తుంది. బ్యాటింగ్‌ విషయంలో అతడికి సమస్యేమీ లేదు. వికెట్ కీపింగ్‌లోనే ఏదైనా ఇబ్బంది ఎదురు కావచ్చు. మోకాళ్లు అరిగిపోతున్నప్పటికీ కీపింగ్‌ చేయడమంటే ధోనీకి చాలా ఇష్టం’’ అని రాబిన్‌ ఉతప్ప తెలిపాడు.

అతడి స్క్రిప్ట్‌ను అతడే రాసుకుంటాడు: ఇయాన్‌ మోర్గాన్

‘‘ధోనీ రిటైర్‌మెంట్‌ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అతడి స్క్రిప్ట్‌ను అతడే రాసుకునే వైవిధ్యభరితమైన క్రికెటర్. రాబిన్‌ ఉతప్ప చెప్పినట్లుగా అతడి మోకాలు ఇబ్బంది పెట్టినా.. ధోనీ మాత్రం తన స్థానాన్ని వదిలిపెట్టాలనుకోడు. ఫ్రాంచైజీని విజయవంతంగా నడిపించేందుకు సిద్ధంగా ఉంటాడు. సమయాన్ని గౌరవిస్తూనే... ఎవరైనా వచ్చి బాధ్యతలు తీసుకునే వరకూ జట్టుతోపాటే ఉంటాడు’’ అని మోర్గాన్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని