Gambhir On IND vs PAK: పోటీనే లేదు.. ఉపఖండ క్రికెట్‌కు కచ్చితంగా చేటే: గంభీర్

భారత్-పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌ అంటేనే తీవ్ర పోటీ ఉంటుందనే భావన అభిమానుల్లో ఉంటుంది. అసలైన క్రికెట్‌ మజాను ఆస్వాదించాలని భావిస్తుంటారు. కానీ, ఈ వరల్డ్‌ కప్‌లో మాత్రం పాక్‌ పోరాటం కూడా చేయకుండానే చేతులెత్తేసింది.

Published : 17 Oct 2023 10:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఫలితం అందరికీ తెలిసిందే. దీనిలో టీమ్ఇండియా (IND vs PAK) పాక్‌ను చిత్తు చేసింది. దాయాది దేశం నుంచి కనీస పోటీ కూడా లేదని.. ఇలాంటి ఆటతీరు ఉపఖండ క్రికెట్‌కు చేటు చేస్తుందని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే బాబర్‌ అజామ్‌ ఆటతీరుపై విమర్శలు గుప్పించిన గంభీర్‌ మరోసారి దాయాదుల పోరుపై విశ్లేషించాడు. 

‘‘పాక్‌పై మళ్లీ భారత్‌ అద్భుతం చేసింది. చితక్కొట్టారనే పదం చాలా తక్కువగా వాడుతుంటాం. అదీనూ భారత్ - పాక్‌ (IND vs PAK) మ్యాచ్‌లో అయితే ఎక్కువగా వినపడదు. ఎందుకంటే ఇరు జట్లూ హోరాహోరీగా తలపడతాయి. విజయం కోసం చివరి వరకూ పోరాడేవి. కానీ, ఇటీవల ఒకటి రెండు సందర్భాల్లో మినహా పాక్‌పై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. అయితే, ఇది ఉపఖండ క్రికెట్‌కు సరైంది కాదు. అందుకే, భారత్‌-పాక్‌ల మధ్య సిరీస్‌లు ఉంటేనే తీవ్ర పోటీ ఉంటుందని మేం ఎప్పుడూ చెబుతుంటాం. కానీ, ఇప్పుడు ఇలాంటి ఆటతీరు చూశాక మాత్రం ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ (IND vs PAK) పోటాపోటీగా ఉంటుందని కచ్చితంగా చెప్పలేను. 

కీలక మ్యాచ్‌లో భారత బౌలర్లు కుల్‌దీప్‌, బుమ్రా క్రమశిక్షణతో బౌలింగ్‌ వేశారు. పాక్‌ జట్టులో షహీన్‌ బృందానికి భారత్‌ బౌలింగ్‌కు ఉన్న ప్రధాన తేడా ఇక్కడే బయటపడింది. ఎలాంటి కెప్టెన్‌కైనా బుమ్రా, కుల్‌దీప్‌ వంటి బౌలర్లు అందుబాటులో ఉంటే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మొత్తం 50 ఓవర్లలో వీరిద్దరే 20 ఓవర్లు పూర్తిచేసి ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్‌ అందించగలరు. చాలా మంది బుమ్రా-షహీన్‌ మధ్య పోలిక పెడుతుంటారు. కానీ, ఆ మ్యాచ్‌లో బుమ్రా మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంచి ఎండ ఉండగా బౌలింగ్‌ వేసి తొలి స్పెల్‌లోనే బ్యాటర్లను కట్టడి చేశాడని గుర్తుంచుకోవాలి’’ అని గంభీర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని