IND vs AUS: వాన కాదు.. మనోళ్లు పడ్డారు
విశాఖపట్నం టీమ్‌ఇండియాకు బాగా కలిసొచ్చిన వేదిక. ఇక్కడ ఎన్నోసార్లు పరుగుల వరద పారించి, వికెట్ల వేటలో విజయవంతమైన ప్రత్యర్థులను మట్టికరిపించిన చరిత్ర భారత్‌ది.
విశాఖలో కుప్పకూలిన టీమ్‌ఇండియా
117 పరుగులకే ఆలౌట్
కంగారూల చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తు
విశాఖ నుంచి ఈనాడు క్రీడా ప్రతినిధి
విశాఖపట్నం టీమ్‌ఇండియాకు బాగా కలిసొచ్చిన వేదిక. ఇక్కడ ఎన్నోసార్లు పరుగుల వరద పారించి, వికెట్ల వేటలో విజయవంతమైన ప్రత్యర్థులను మట్టికరిపించిన చరిత్ర భారత్‌ది. కానీ ఇక్కడ ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు వర్షం ముప్పుందని వార్తలొచ్చేసరికి విశాఖ అభిమానుల్లో నిరుత్సాహం! వరుణుడా కరుణించు అంటూ ఉదయం నుంచి వేడుకుంటూ వచ్చారు. మధ్యాహ్నానికి వరుణుడు కరుణించాడు. మ్యాచ్ జరగనిచ్చాడు. కానీ మ్యాచ్ అయ్యేసరికి వర్షం వద్దని ఎందుకు కోరుకున్నామా అని పశ్చాత్తాపం! వాన వల్ల మ్యాచ్ రద్దయిపోయినా బాగుండే అన్న నిట్టూర్పు! ఇప్పటిదాకా ఎక్కువగా భారత జట్టుకు తీపి గుర్తులనే మిగులుస్తూ వచ్చిన విశాఖ.. ఈసారి ఎప్పటికీ మరిచిపోలేని చేదు జ్ఞాపకాన్ని అందించింది. 117 పరుగులకే కుప్పకూలి.. కంగారూల చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తయింది రోహిత్ సేన.
విశాఖపట్నంలో టీమ్‌ఇండియా తేలిపోయింది. మొదట బ్యాటింగ్.. తర్వాత బౌలింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఆసీస్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. పేసర్ మిచెల్ స్టార్క్ (5/53) బంతితో నిప్పులు చెరిగిన వేళ.. ఆదివారం రెండో వన్డేలో ఆసీస్ 10 వికెట్ల తేడాతో రోహిత్ సేనను చిత్తుగా ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టార్క్‌తో పాటు అబాట్ (3/23), ఎలిస్ (2/13)ల దెబ్బకు రోహిత్ సేన విలవిలలాడింది. అనంతరం ఆసీస్ కేవలం 11 ఓవర్లలో ఒక్క వికెట్టూ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (51 నాటౌట్; 30 బంతుల్లో 10×4), మిచెల్ మార్ష్ (66 నాటౌట్; 36 బంతుల్లో 6×4, 6×6) తొలి వికెట్‌కు అజేయంగా 121 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముగించేశారు. బుధవారం చెన్నైలో నిర్ణయాత్మక మూడో వన్డే జరుగుతుంది.
గంటలోపే స్వాహా: 118 పరుగులంటే స్వల్ప లక్ష్యమే. పోరాడేందుకు అవకాశాలు తక్కువే. కానీ మ్యాచ్ గెలవకపోయినా.. రెండు మూడు వికెట్లయినా పడగొట్టి పోటీలో ఉన్నాం అనిపించుకోవాలి. ముంబయిలో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ నుంచి అలాంటి పోటీనే చూశాం. కానీ భారత బౌలర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు. సాయంత్రం 4.32 గంటలకు ఆసీస్ బ్యాటింగ్ ఆరంభం కాగా.. 5.29 గంటలకు మ్యాచ్ పూర్తయింది. అంటే.. సరిగ్గా 57 నిమిషాలు. భారత ఇన్నింగ్స్‌లో జట్టంతా కలిపి 9 ఫోర్లు కొడితే.. మార్ష్ ఒక్కడే 6 సిక్సర్లు బాదాడు. హెడ్, మార్ష్ కలిసి 16 బౌండరీలు కొట్టారు. 121 స్కోరులో 100 పరుగులు ఫోర్లు, సిక్సర్ల రూపంలో వచ్చాయంటే భారత బౌలింగ్ ఎంత పేలవంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. షమి వేసిన తొలి ఓవర్లో 2 పరుగులే వచ్చేసరికి ఛేదనలో ఆసీస్ కష్టపడుతుందనుకున్నారు. కానీ రెండో ఓవర్ నుంచి ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. బౌండరీల మోత మోగిస్తూ ఇంకో పది ఓవర్లకే మ్యాచ్‌ను ముగించేశారు మార్ష్, హెడ్,. మార్ష్ 28 బంతుల్లో అర్ధశతకం సాధిస్తే.. హెడ్ 29 బంతుల్లోనే ఆ మార్కును చేరుకున్నాడు.
వాంఖడేను మించి..: వాంఖడేలో జరిగిన తొలి వన్డేలో 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి చాలా కష్టపడ్డ భారత్.. విశాఖలో మొదట బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా తడబడింది. రాత్రి నుంచి ఉదయం వరకు వర్షం కురవడం.. పిచ్ నుంచి పేసర్లకు సహకారం లభిస్తుందన్న అంచనా.. మళ్లీ వాన పడినా లక్ష్య ఛేదన చేయొచ్చన్న ఉద్దేశంతో టాస్ గెలవగానే కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆ ఆలోచన సరైందని తేలడానికి ఎంతోసేపు పట్టలేదు. మొదటి బంతి నుంచే స్టార్క్ స్వింగ్‌కు ప్రయత్నించాడు. మూడో బంతికే శుభ్‌మన్ గిల్ (0) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అచ్చం తొలి వన్డేలో మాదిరిగానే దూరంగా వెళ్తున్న బంతిని పుష్ చేసిన గిల్.. పాయింట్‌లో లబుషేన్ చేతికి చిక్కాడు. తర్వాత రోహిత్ (13), విరాట్ (31; 35 బంతుల్లో 4×4) ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మ్యాచ్ సాగుతున్నాకొద్దీ స్టార్క్ స్వింగ్ మరింత పదునెక్కింది. అతడి ధాటికి రోహిత్ వెనుదిరక్క తప్పలేదు. మంచి సీమ్‌తో ఆఫ్‌స్టంప్ ఆవల సంధించిన బంతిని రోహిత్ కవర్స్ మీదుగా డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కాని బ్యాటును తాకుతూ వేగంగా దూసుకొచ్చిన బంతిని స్లిప్‌లో స్మిత్ తడబడుతూనే ఒడిసిపట్టుకున్నాడు. ఆ తర్వాతి బంతికే సూర్యకుమార్ యాదవ్ (0) ఔటయ్యాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిర్లక్షంగా ఆడి డకౌటయ్యాడు. తొలి వన్డే మాదిరే స్టార్క్ బౌలింగ్‌లోనే మొదటి బంతికే వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. సమీక్ష కూడా అవసరం లేదంటూ కోహ్లి చెప్పడంతో సూర్య నిరాశగా వెనుదిరిగాడు. తొలి వన్డే హీరో కేఎల్ రాహుల్ (9) ఈసారి నిలవలేకపోయాడు. అతణ్ని కూడా స్టార్కే వికెట్ల ముందు బలిగొన్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనే భారత్‌కు మరో ఎదురుదెబ్బ. అబాట్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య (1) దూరంగా వెళ్తున్న బంతినిని ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు. స్మిత్ కుడివైపు పూర్తిగా గాల్లోకి దూకుతూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. పది ఓవర్లయినా అవ్వకముందే భారత్ 49/5కు చేరుకుంది.
కోహ్లి కూడా..: పిచ్ నుంచి పేసర్లకు సహకారం లభిస్తుండటంతో కోహ్లి కాస్త ఆచితూచి ఆడాడు. జడేజా (16) సహకారంతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అడపాదడపా బౌండరీలు సాధిస్తూ 15 ఓవర్ల వరకు బండిని లాంగించాడు. స్టార్క్ 6 ఓవర్ల తన మొదటి స్పెల్‌లో ఒక మెయిడిన్ వేసి.. 31 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. స్టార్క్ స్పెల్ ముగియగానే అబాట్‌తో కలిసి ఎలిస్ దాడి కొనసాగించాడు. ఇన్నింగ్స్‌ను నిలబెట్టేలా కనిపిస్తున్న కోహ్లీని ఎలిస్ ఔట్ చేయడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. మంచి సీమ్‌తో ఫుల్ లెంగ్త్‌లో నేరుగా వికెట్లను లక్ష్యంగా సంధించిన బంతిని ఆడటంలో కోహ్లి లైన్ తప్పాడు. వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి స్కోరు 71/6. ఈ దశలో అక్షర్ (29 నాటౌట్; 29 బంతుల్లో 1×4, 2×6) పోరాడినా.. మరో ఎండ్‌లో జడేజా, కుల్‌దీప్ (4), షమి (0) పెవిలి యన్‌కు వరుస కట్టారు. జట్టు స్కోరును 100 దాటించిన అక్షర్.. స్టార్క్ వేసిన 26వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. కానీ అదే ఓవర్లో చివరి బంతికి సిరాజ్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేసిన స్టార్క్.. భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
117
సొంతగడ్డ మీద వన్డేల్లో ఆస్ట్రేలియాపై భారత్‌కిదే అత్యల్ప స్కోరు. మొత్తంగా వన్డేల్లో టీమ్‌ఇండియాకిది నాలుగో అతి తక్కువ స్కోరు.
ఆస్ట్రేలియా 234 బంతులుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. బంతుల తేడా పరంగా భారత్‌కు వన్డేల్లో ఇదే అతి పెద్ద ఓటమి.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 13; గిల్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 0; కోహ్లి (ఎల్బీ) (బి) ఎలిస్ 31; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) స్టార్క్ 0; రాహుల్ (ఎల్బీ) (బి) 9; హార్దిక్ (సి) స్మిత్ (బి) అబాట్ 1; జడేజా (సి) కేరీ (బి) ఎలిస్ 16; అక్షర్ నాటౌట్ 29; కుల్‌దీప్ (సి) హెడ్ (బి) అబాట్ 4; షమి (సి) కేరీ (బి) అబాట్ 0; సిరాజ్ (బి) స్టార్క్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం: (26 ఓవర్లలో ఆలౌట్) 117; వికెట్ల పతనం: 1-3, 2-32, 3-32, 4-48, 5-49, 6-71, 7-91, 8-103, 9-103; బౌలింగ్: స్టార్క్ 8-1-53-5; గ్రీన్ 5-0-20-0; అబాట్ 6-0-23-3; ఎలిస్ 5-0-13-2; జంపా 2-0-6-0
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హెడ్ నాటౌట్ 51; మార్ష్ నాటౌట్ 66; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 121; బౌలింగ్: షమి 3-0-29-0; సిరాజ్ 3-0-37-0; అక్షర్ 3-0-25-0; హార్దిక్ 1-0-18-0; కుల్‌దీప్ 1-0-12-0
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Latestnews News
Ambati Rayudu: అంబటి రాయుడి విషయంలో మేనేజ్మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది: అనిల్ కుంబ్లే
-
General News
Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్
-
Movies News
Nayanthara: ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్