Ravindra Jadeja: కట్టిపడేస్తున్నాడు..

సాధారణంగా బ్యాటింగ్‌ అనుకూల పిచ్‌లపై తన కచ్చితత్వంతో కూడిన బౌలింగ్‌తో జట్టుకు జడేజా ఎంతో ఉపయోగపడతాడు.

Updated : 21 Oct 2023 07:05 IST

దిల్లీ

రవీంద్ర జడేజా..! ఈ ఆల్‌రౌండర్‌ ఎంత విలువైన ఆటగాడో కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ ప్రపంచకప్‌ మొదలైనప్పటి నుంచి అది మరింత స్పష్టంగా అర్థమవుతోంది. టోర్నీలో ఇప్పటివరకు అతడికి బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాలేదు కానీ.. బంతితో ఇంతకుముందు కన్నా మిన్నగా ప్రభావం చూపిస్తుండడం విశేషం.

సాధారణంగా బ్యాటింగ్‌ అనుకూల పిచ్‌లపై తన కచ్చితత్వంతో కూడిన బౌలింగ్‌తో జట్టుకు జడేజా ఎంతో ఉపయోగపడతాడు. అదే పిచ్‌ కాస్త అనుకూలించిందా.. జట్టుకు ప్రమాదకర ఆయుధంగా మారతాడు. ఇప్పుడు అతడు ప్రపంచకప్‌లో తన స్పిన్‌తో టీమ్‌ఇండియాకు అత్యంత కీలకమవుతున్నాడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టోర్నీలో జడేజా గణాంకాలు అద్భుతంగా ఏమీ అనిపించకపోవచ్చు. నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. కానీ మిడిల్‌ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి పరుగుల వేగానికి బ్రేకులు వేస్తూ ఇన్నింగ్స్‌ గమనాన్నే మార్చేస్తున్నాడు. బ్యాటర్లను కట్టిపడేసే అతడి కచ్చితత్వమే.. మరోవైపు నుంచి కుల్‌దీప్‌ యాదవ్‌ మరింతగా ఎటాక్‌ చేయడానికి వీలు కల్పిస్తోంది.

131 డాట్‌ బాల్స్‌: ఈ ప్రపంచకప్‌లో జడేజా మరింత మెరుగ్గా బౌలింగ్‌ చేస్తున్నాడు. నాలుగు మ్యాచ్‌లో కలిపి 37.5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అతడు ఏకంగా 131 డాట్‌ బాల్స్‌ వేశాడంటే.. బ్యాటర్లకు ఎలా కళ్లెం వేస్తున్నాడో, పరుగుల వేగాన్ని ఎలా నియంత్రిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. జడేజా 21.5 ఓవర్ల డాట్‌ బాల్స్‌ వేశాడు. అంటే.. అతడి బౌలింగ్‌లో డాట్‌ బాల్స్‌ శాతం 58.22. బౌండరీ బాల్స్‌ 11 మాత్రమే. అందులో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి.

ఇలా ఎలా..: మరి ఈ టోర్నీలో జడేజా ఇంత ప్రభావవంతంగా బౌలింగ్‌ చేయడానికి కారణమేంటి? ఇదే విషయాన్ని తొలి మ్యాచ్‌ అనంతరం ఓ విలేకరి అతణ్ని అడిగితే.. ‘‘నా గేమ్‌ప్లాన్‌ను నేను వెల్లడించను. చెబితే.. ఇంగ్లిష్‌లో రాసేస్తారు. ప్రత్యర్థులు చదివి తెలుసుకుంటారు’’ అని జడ్డూ నవ్వుతూ జవాబిచ్చాడు. అయితే మాజీ స్పిన్నర్‌ మురళీ కార్తీక్‌.. జడేజా బౌలింగ్‌ ఇంతకుముందు కంటే పదునెక్కడానికి కారణాన్ని విశ్లేషించాడు. ‘‘జడేజా ఇంతకుముందు రౌండ్‌ ఆర్మ్‌తో బౌలింగ్‌ చేసేవాడు. దీని వల్ల బంతి ఎక్కువగా టర్న్‌ కాదు. పిచ్‌ స్పిన్‌కు బాగా సహకరించినప్పుడు ఈ డెలివరీలు  ప్రమాదకరమవుతాయి. కానీ మంచి పిచ్‌లపై నాణ్యమైన అంతర్జాతీయ బ్యాటర్లను ఈ డెలివరీలు పెద్దగా ఇబ్బంది పెట్టలేవు. ఇప్పుడు జడేజా రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ చేయడం మానేశాడు. తన బంతి నిలకడగా సీమ్‌పై ల్యాండవుతోంది. దాంతో అతడికి అదనపు బౌన్స్‌తో పాటు తగినంత టర్న్‌ లభిస్తోంది. బ్యాటర్లను బీట్‌ చేయగలుగుతున్నాడు’’ అని కార్తీక్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని