SA vs IND: సిరీస్‌ చిక్కేదెవరికో?

వన్డే సిరీస్‌లో ఆఖరి సమరానికి వేళైంది. గురువారం జరిగే చివరి వన్డేలో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. ప్రస్తుతం రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి వన్డేలో భారత్‌, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా పైచేయి సాధించిన సంగతి తెలిసిందే.

Updated : 21 Dec 2023 06:59 IST

భారత్‌, దక్షిణాఫ్రికా చివరి వన్డే నేడు
సాయంత్రం 4.30 నుంచి

పార్ల్‌ (దక్షిణాఫ్రికా): వన్డే సిరీస్‌లో ఆఖరి సమరానికి వేళైంది. గురువారం జరిగే చివరి వన్డేలో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. ప్రస్తుతం రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి వన్డేలో భారత్‌, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా పైచేయి సాధించిన సంగతి తెలిసిందే. మరి నిర్ణయాత్మక పోరులో గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకునేదెవరో! ఆసక్తికర పోరు ఖాయం.

ఓపెనర్లు పుంజుకుంటేనే..!: టీమ్‌ఇండియా ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో ఒకే ఒక్కసారి (2018లో) వన్డే సిరీస్‌ గెలుచుకుంది. మరోసారి నెగ్గాలంటే ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, సాయి సుదర్శన్‌ నుంచి బలమైన ఆరంభం అవసరం. కొత్త కుర్రాడు సుదర్శన్‌ ఆట జట్టుకు సంతోషాన్నిస్తోంది. అతడు గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 55, 62 పరుగులతో ఆకట్టుకున్నాడు. కానీ మరోవైపు నుంచి రుతురాజే అతడికి సహకారాన్ని ఇవ్వలేకపోయాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ అతడు విఫలమయ్యాడు. వరుసగా 5, 4 పరుగుల వద్ద ఔటయ్యాడు. తొలి వన్డేలో 23 వద్ద, రెండో వన్డేలో నాలుగు వద్ద ఓపెనింగ్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ నిర్ణయాత్మకలో భారత్‌ ఇన్నింగ్స్‌ ఎలా మొదలవుతుందో చూడాలి. మరోవైపు తిలక్‌ వర్మ ఆట జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. కెరీర్‌ ఆరంభంలో చక్కని ఆటతో ఆశలు రేపిన ఆ యువ ఆటగాడు ఇటీవల తడబడుతున్నాడు. పరుగుల వేటలో బాగా వెనుకబడ్డాడు. భారత్‌ మంచి స్కోరు చేయాలంటే ఈ హైదరాబాదీ బ్యాటర్‌ ఫామ్‌ను అందుకోవడం అవసరం. అయితే ఈ మ్యాచ్‌లో అతణ్ని ఆడిస్తారా లేదా రజత్‌ పటీదార్‌కు అవకాశం కల్పిస్తారా అన్నది చూడాలి.

టెస్టు మ్యాచ్‌లకు సిద్దం కావడం కోసం శ్రేయస్‌ అయ్యర్‌ చివరి రెండు వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. సంజు శాంసన్‌కు మరో అవకాశం దక్కొచ్చు. ఇక బౌలింగ్‌లో ముకేశ్‌ పుంజుకోవాల్సివుంది. గత రెండు మ్యాచ్‌లో అతడు ఒక్క వికెట్టూ పడగొట్టలేదు. అర్ష్‌దీప్‌, అవేష్‌ ఖాన్‌ తొలి మ్యాచ్‌లోలా విజృంభించాలని జట్టు కోరుకుంటోంది. మరోవైపు రెండో వన్డేలో నెగ్గిన దక్షిణాఫ్రికా.. రెట్టించిన ఉత్సాహంతో మ్యాచ్‌కు సిద్ధమైంది. రెండో వన్డేలో శతకం సాధించిన జోర్జి.. డికాక్‌ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం చూస్తున్న ఆ జట్టు ఆశలు రేపాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఎలా ఆడతాడో చూడాలి. మూడో వన్డే వేదికలో పిచ్‌ బ్యాటర్లకు అనుకూలించే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని