Kolkata Vs Hyderabad: గెలుపు ముంగిట బోల్తా

సన్‌రైజర్స్‌ లక్ష్యం 208. 17 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 149/5. మూడు ఓవర్లలో 60 పరుగులు చేయాలి. ఈ సీజన్‌ పరాజయంతోనే మొదలు కాబోతోందని ఆ జట్టు అభిమానులు ఓ అంచనాకు వచ్చేశారు.

Updated : 24 Mar 2024 08:47 IST

సన్‌రైజర్స్‌ను ముంచిన ఆఖరి ఓవర్‌
క్లాసెన్‌ అద్భుత పోరాటం వృథా
రసెల్‌ విధ్వంసం.. మెరిసిన హర్షిత్‌
ఉత్కంఠ పోరులో కోల్‌కతాదే విజయం

సన్‌రైజర్స్‌ లక్ష్యం 208. 17 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 149/5. మూడు ఓవర్లలో 60 పరుగులు చేయాలి. ఈ సీజన్‌ పరాజయంతోనే మొదలు కాబోతోందని ఆ జట్టు అభిమానులు ఓ అంచనాకు వచ్చేశారు. కానీ విధ్వంసానికి మారుపేరైన హెన్రిచ్‌ క్లాసెన్‌ మాత్రం కాదు. ఒత్తిడిలో సిక్సర్ల మోత మోగిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా కనిపించాడు ఈ సఫారీ వీరుడు. 5 బంతుల్లో 7 పరుగులతో సమీకరణం తేలికైపోయింది. సన్‌రైజర్స్‌ గెలుపు లాంఛనమే అన్నట్లు ఆ జట్టు డగౌట్లో వాతావరణం తేలికైపోయింది. కానీ ఆఖరి 5 బంతుల్లో అద్భుతం చేసిన యువ పేసర్‌ హర్షిత్‌ రాణా కేవలం 2 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్‌ను కోల్‌కతా ఎగరేసుకుపోయింది. సన్‌రైజర్స్‌కు వేదనే మిగిలింది.


కోల్‌కతా

కొత్త కెప్టెన్‌ సారథ్యంలో, మారిన జట్టుతో సీజన్‌ను సరికొత్తగా ఆరంభించాలని చూసిన సన్‌రైజర్స్‌కు నిరాశ తప్పలేదు. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన తన ఆరంభ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 4 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఓటమి పాలైంది. మొదట కోల్‌కతా 7 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆండ్రి రసెల్‌ (64 నాటౌట్‌; 25 బంతుల్లో 3×4, 7×6) సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫిల్‌ సాల్ట్‌ (54; 40 బంతుల్లో 3×4, 3×6) కూడా రాణించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్‌ (3/32), మయాంక్‌ మార్కండే (2/39) రాణించారు. అనంతరం ఛేదనలో సన్‌రైజర్స్‌ తడబడ్డప్పటికీ.. హెన్రిచ్‌ క్లాసెన్‌ (63; 29 బంతుల్లో 8×6) అసాధారణ ఇన్నింగ్స్‌తో ఆ జట్టులో ఆశలు రేపాడు. కానీ ఆఖరి ఓవర్లో గొప్పగా బౌలింగ్‌ చేసిన హర్షిత్‌ (3/33).. కోల్‌కతాను గెలిపించాడు. ఆ జట్టు 7 వికెట్లకు 204 పరుగులే చేయగలిగింది.
క్లాసెన్‌ అద్భుతః: సన్‌రైజర్స్‌ ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఈ మ్యాచ్‌లో క్లాసెన్‌ పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. తీవ్ర ఒత్తిడిలో తొణకకుండా అతను ఆడిన షాట్లు అసామాన్యం. కానీ ఆఖర్లో గురి తప్పిన ఒక్క షాట్‌ అతడి ఇన్నింగ్స్‌కు తెరదించి సన్‌రైజర్స్‌కు మ్యాచ్‌ను దూరం చేసింది. భారీ ఛేదనలో సన్‌రైజర్స్‌కు మయాంక్‌ అగర్వాల్‌ (32), ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అభిషేక్‌ శర్మ (32) మంచి ఆరంభమే ఇచ్చారు. కానీ వీళ్లిద్దరూ వెనుదిరిగాక స్కోరు వేగం తగ్గింది. రాహుల్‌ త్రిపాఠి (20), మార్‌క్రమ్‌ (18) దూకుడుగా ఆడలేదు. సమద్‌ (15) సైతం నిరాశపరిచాడు. క్లాసెన్‌ సైతం వేగంగా ఆడలేకపోతుండటంతో హైదరాబాద్‌ భారీ తేడాతో ఓడబోతోందన్న అంచనాకు వచ్చేశారు అభిమానులు. కానీ 18 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన స్థితిలో హైదరాబాద్‌కు స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌ వరంలా మారింది. అతను వేసిన 18వ ఓవర్లో క్లాసెన్‌ 2 సిక్సర్లు బాదితే.. షాబాజ్‌ (16) ఓ సిక్సర్‌ అందుకున్నాడు. తర్వాత స్టార్క్‌కు చుక్కలు చూపించేశారు వీళ్లిద్దరూ. అతను వేసిన 19వ ఓవర్లో క్లాసెన్‌ తొలి నాలుగు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టాడు. చివరి బంతికి షాబాజ్‌ సిక్స్‌ బాదాడు. 6 బంతుల్లో 13 పరుగులతో సమీకరణం తేలికైంది. చివరి ఓవర్‌ తొలి బంతికే క్లాసెన్‌ 6 బాదడంతో కోల్‌కతా పనైపోయినట్లే అనిపించింది. కానీ తర్వాతి బంతికి క్లాసెన్‌ సింగిల్‌ తీయడం తప్పయింది. మూడో బంతికి షాబాజ్‌ ఔటైపోయాడు. నాలుగో బంతికి యాన్సెన్‌ సింగిల్‌ తీయగా.. హర్షిత్‌ వేగం తగ్గించి వేసిన 5వ బంతికి క్లాసెన్‌ షాట్‌ ఆడబోగా బంతి వికెట్ల వెనుక గాల్లోకి లేచింది. సుయాశ్‌ చక్కటి క్యాచ్‌తో క్లాసెన్‌ కథ ముగించాడు. చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా.. కమిన్స్‌ షాట్‌ ఆడడంలో విఫలమయ్యాడు.
పిడుగులా పడ్డాడు..: 53/4.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 8 ఓవర్లకు చేసిన స్కోరిది. ఈ దశలో 150 చేసినా గొప్పే అనుకున్న జట్టు 200 దాటిందంటే అది మెరుపు వీరుడు ఆండ్రి రసెల్‌ పుణ్యమే. ఆఖరి ఓవర్లలో అతడి విధ్వంసంతో కోల్‌కతా ఊహించని స్కోరు సాధించింది. నటరాజన్‌ ధాటికి పవర్‌ ప్లేలో కోల్‌కతా తీవ్రంగా ఇబ్బంది పడింది. ఓపెనర్‌ సాల్ట్‌.. యాన్సెన్‌ బౌలింగ్‌లో మూడు వరుస సిక్సర్లతో ఇన్నింగ్స్‌కు మెరుపు ఆరంభాన్నిచ్చినా.. మరో ఓపెనర్‌ నరైన్‌ (2) రనౌటైపోవడం.. నటరాజన్‌ ఒకే ఓవర్లో వెంకటేశ్‌ అయ్యర్‌ (7), శ్రేయస్‌ (0)లను ఔట్‌ చేయడం.. నితీశ్‌ రాణా (9) కూడా ఎక్కువసేపు నిలవకపోవడంతో కోల్‌కతాకు ఇబ్బందులు తప్పలేదు. అయితే క్రీజులోకి వచ్చీ రాగానే చెలరేగిపోయిన రమణ్‌దీప్‌ (35; 17 బంతుల్లో 1×4, 4×6)తో కలిసి సాల్ట్‌ కూడా ఎదురుదాడి చేయడంతో నైట్‌రైడర్స్‌ వేగంగా కోలుకుంది. ఈ జోడీ 27 బంతుల్లోనే 54 పరుగులు జోడించింది. సన్‌రైజర్స్‌ బౌలర్లు పుంజుకుని వీళ్లిద్దరినీ తక్కువ వ్యవధిలో ఔట్‌ చేయగా.. రసెల్‌ రాకతో హైదరాబాద్‌ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. మరో ఎండ్‌లో రింకు సింగ్‌ (23) సహకారమందిస్తుంటే.. రసెల్‌ చెలరేగిపోయాడు. మార్కండే వేసిన 16వ ఓవర్లో మూడు సిక్సర్లు బాదిన ఈ విండీస్‌ వీరుడు.. తర్వాత భువనేశ్వర్‌, నటరాజన్‌లనూ శిక్షించాడు. అతడి ధాటికి భువి 19వ ఓవర్లో 26 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి 5 ఓవర్లలో కోల్‌కతా ఏకంగా 85 పరుగులు సాధించింది.


ఆ ఇద్దరూ తేలిపోయారు

ఐపీఎల్‌ వేలంలో అత్యధిక రేటు పలికిన ఆటగాడు ఆ ధరకు తగ్గ ప్రదర్శన చేయకపోవడం ఆనవాయితీ! ఈసారి కూడా తొలి మ్యాచ్‌లో అదే జరిగింది. వేలంలో అనూహ్యమైన ధర దక్కించుకున్న టాప్‌-2 ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్‌లో తేలిపోయారు. రూ.24.75 కోట్లతో రికార్డు ధర పలికిన మిచెల్‌ స్టార్క్‌ 4 ఓవర్లలో ఒక్క వికెట్టూ తీయకుండా ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖర్లో క్లాసెన్‌ అతడి బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. ఇక సన్‌రైజర్స్‌ రూ.20.5 కోట్లతో కొని తమ జట్టు కెప్టెన్‌గా నియమించుకున్న కమిన్స్‌.. 4 ఓవర్లలో ఒక వికెట్టే పడగొట్టి 32 పరుగులు ఇచ్చుకున్నాడు. అనంతరం సన్‌రైజర్స్‌ చివరి బంతికి 5 పరుగులు చేయాల్సిన స్థితిలో కమిన్స్‌ షాట్‌ ఆడడంలోనూ విఫలమయ్యాడు.


కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) యాన్సెన్‌ (బి) మార్కండే 54; నరైన్‌ రనౌట్‌ 2; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) యాన్సెన్‌ (బి) నటరాజన్‌ 7; శ్రేయస్‌ (సి) కమిన్స్‌ (బి) నటరాజన్‌ 0; నితీశ్‌ రాణా (సి) త్రిపాఠి (బి) మార్కండే 9; రమణ్‌దీప్‌ (సి) మార్కండే (బి) కమిన్స్‌ 35; రింకు (సి) మార్‌క్రమ్‌ (బి) నటరాజన్‌ 23; రసెల్‌ నాటౌట్‌ 64; స్టార్క్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 208; వికెట్ల పతనం: 1-23, 2-32, 3-32, 4-51, 5-105, 6-119, 7-200; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-51-0; యాన్సెన్‌ 3-0-40-0; నటరాజన్‌ 4-0-32-3; కమిన్స్‌ 4-0-32-1; మార్కండే 4-0-39-2; షాబాజ్‌ అహ్మద్‌ 1-0-14-0
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) రింకు (బి) హర్షిత్‌ 32; అభిషేక్‌ శర్మ (సి) వరుణ్‌ (బి) రసెల్‌ 32; రాహుల్‌ త్రిపాఠి (సి) హర్షిత్‌ (బి) నరైన్‌ 20; మార్‌క్రమ్‌ (సి) రింకు (బి) వరుణ్‌ 18; క్లాసెన్‌ (సి) సుయాశ్‌ (బి) హర్షిత్‌ 63; సమద్‌ (సి) వెంకటేశ్‌ అయ్యర్‌ (బి) రసెల్‌ 15; షాబాజ్‌ (సి) శ్రేయస్‌ అయ్యర్‌ (బి) హర్షిత్‌ 16; యాన్సెన్‌ నాటౌట్‌ 1; కమిన్స్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 204; వికెట్ల పతనం: 1-60, 2-71, 3-107, 4-111, 5-145, 6-203, 7-204; బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-53-0; హర్షిత్‌ రాణా 4-0-33-3; వరుణ్‌ చక్రవర్తి 4-0-55-1; నరైన్‌ 4-0-19-1; రసెల్‌ 2-0-25-2; సుయాశ్‌ 2-0-18-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని