Harbhajan Singh: ప్రపంచకప్‌లో భారత్ ఓటమి.. దయ చేసి అలా చేయొద్దు: హర్భజన్ సింగ్

 ప్రపంచకప్‌ ఫైనల్‌లో  భారత్ ఓటమి అనంతరం ఆసీస్‌ ఆటగాళ్లు, వారి కుటుంబాలపై ట్రోలింగ్ చేయడాన్ని టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ (Harbhajan Singh) తప్పుబట్టాడు.

Published : 21 Nov 2023 18:20 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కొంతమంది అభిమానులు ఆస్ట్రేలియా ఆటగాళ్లపై, వారి కుటుంబాలపై ట్రోలింగ్‌ చేస్తున్నారు. దీనిని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ ఖండించాడు. దయచేసి ఆసీస్‌ ఆటగాళ్లు, వారి కుటుంబాలపై ట్రోలింగ్ చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. భారత్‌ ఫైనల్‌ ఓడిపోయిన అనంతరం ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ భార్య వినీ రామన్‌పై కొంతమంది అనుచిత కామెంట్స్‌ చేశారు. దీనికి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హర్భజన్ సింగ్ ట్రోలింగ్ అంశంపై స్పందించాడు.

‘‘ఆస్ట్రేలియా క్రికెటర్ల కుటుంబ సభ్యులపై ట్రోలింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. మన జట్టు బాగా ఆడింది. కానీ, ఫైనల్‌లో ఆసీస్ మెరుగైన ఆటతీరు కనబర్చడంతో మనం ఓడిపోయాం.  ఆటగాళ్లు, వారి కుటుంబాలపై ట్రోలింగ్‌ చేయడం ఎందుకు? అలా చేయొద్దని క్రికెట్ అభిమానులందరినీ కోరుతున్నా. చిత్తశుద్ధి, గౌరవం చాలా ముఖ్యమైనవి’’ అని హర్భజన్ సింగ్ ఎక్స్‌ (X)లో పోస్ట్ చేశాడు.


బాబర్‌ అజామ్‌, కోహ్లీ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్

నవంబర్‌ 23 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లు దూరంగా ఉండటంతో సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటాడు. తొలి మ్యాచ్‌ నవంబర్‌ 23న విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఇదిలా ఉండగా.. టీ20ల్లో పాక్‌ ఆటగాడు బాబర్‌ అజామ్, భారత ప్లేయర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డుపై సూర్యకుమార్ యాదవ్ కన్నేశాడు. అతడు వచ్చే మ్యాచ్‌లో 159 పరుగులు చేస్తే టీ20ల్లో వేగంగా 2000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. అలా జరగని పక్షంలో.. సూర్య మరో రెండు ఇన్నింగ్స్‌ల్లో 159 పరుగులు చేస్తే బాబర్‌ అజామ్, మహ్మద్‌ రిజ్వాన్ (52 ఇన్నింగ్స్‌ల్లో) సరసన నిలుస్తాడు. సూర్యకుమార్  మరో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 159 పరుగులు చేస్తే కోహ్లీని అధిగమించి భారత్ తరఫున టీ20ల్లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.


పాకిస్థాన్‌కు బౌలింగ్‌ కోచ్‌లు

పాకిస్థాన్‌ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్, స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌లను పీసీబీ నియమించింది. పాక్‌ మాజీ ఆటగాడు ఉమర్‌ గుల్‌ను పేస్ బౌలింగ్‌, సయ్యద్ అజ్మల్‌ను స్పిన్ బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక చేసింది. ఉమర్‌ గుల్‌కు గతంలో పాక్‌ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన అనుభవముంది. డిసెంబరులో పాక్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆసీస్‌తో  డిసెంబర్ 14 నుంచి జనవరి 7 వరకు రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అనంతరం న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్తుంది. అక్కడ కివీస్‌తో జనవరి 12 నుంచి జనవరి 21 వరకు ఐదు టీ20లు ఆడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు