Virat-Anushka: విరుష్క జోడీకి రెండో సంతానం వార్తలు.. హర్ష గోయెంకా బిగ్‌ హింట్‌

Virat-Anushka Second Child: విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ జంటను ఉద్దేశిస్తూ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా చేసిన పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

Published : 15 Feb 2024 14:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli), నటి అనుష్క శర్మ (Anushka Sharma) దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు గత కొన్ని రోజులుగా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల కోహ్లీ ఫ్రెండ్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ (AB de Villiers) దీన్ని ధ్రువీకరిస్తూ.. ఆ తర్వాత పొరబాటుగా చెప్పానని యూటర్న్‌ తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) దీనిపై బిగ్‌ హింట్‌ ఇచ్చారు.

ఆయన చేసిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ‘‘మరికొద్ది రోజుల్లో ఓ బిడ్డ ఈ భూమ్మీదకు రాబోతోంది. గొప్ప క్రికెటర్‌ అయిన తండ్రి మాదిరిగానే ఆ బిడ్డ కూడా భారత్‌ను ఉన్నత శిఖరాలను తీసుకెళ్తుందని ఆశిస్తున్నా. లేదా తన తల్లిలా సినిమా స్టార్‌ అవుతుందా?’’ అని గోయెంకా రాసుకొచ్చారు. దీనికి ToBeBornInLondon అనే హ్యష్‌ట్యాగ్‌ను జత చేశారు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. విరుష్క జోడీ రెండో సంతానాన్ని ఉద్దేశిస్తూనే ఆయన ఆ పోస్ట్‌ పెట్టారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సెలవు తీసుకోవడం విరాట్‌ హక్కు.. యువ ఆటగాళ్లు రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడాల్సిందే: జై షా

వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో సిరీస్‌ మొత్తానికి కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘకాలం పాటు అతడు ఆట నుంచి విరామం తీసుకోవడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందని, ప్రస్తుతం కోహ్లీ కుటుంబం లండన్‌లో ఉందనే ప్రచారం మొదలైంది. ఇటీవల ఏబీడీ దీనిపై స్పందిస్తూ.. కోహ్లీ రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమే అని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు యూటర్న్‌ తీసుకుని.. తన వ్యాఖ్యలు తప్పు అని అన్నాడు. తాను పెద్ద పొరబాటు చేశానని, అందులో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నాడు.

2017లో విరాట్‌ - అనుష్క వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. 2021లో వీరికి వామిక జన్మించింది. కోహ్లీ జట్టుకు దూరంగా ఉండటానికి గల కారణాలేంటనే దానిపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత లేదు. అతడి తల్లి ఆరోగ్యం సరిగా లేదనే వార్తలూ వచ్చినా.. వాటిని కుటుంబసభ్యులు కొట్టిపారేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని