Asia Cup: ఒక్క రోజులోనే మాట మార్చిన పాక్‌ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్‌

ఆసియా కప్‌ 2023 టోర్నీ నిర్వహణకు సంబంధించి వచ్చిన ట్విస్టులు మరే ఇతర టోర్నీలకు వచ్చి ఉండదేమో. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు కాబోయే కొత్త ఛైర్మన్ జకా అష్రాఫ్.. మాటలను భలేగా మార్చేస్తూ ఉత్కంఠ పెంచుతున్నారు.

Published : 23 Jun 2023 11:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డుకు (PCB) కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించబోయే జకా అష్రాఫ్‌.. ఆసియా కప్‌ (Asia Cup 2023) విషయంలో 24 గంటల్లోపే మాట మార్చేశారు. ఆసియా కప్‌ నిర్వహణ కోసం గత పీసీబీ ఛైర్మన్ ప్రతిపాదించిన ‘హైబ్రిడ్‌ మోడల్‌’ను అంగీకరించేది లేదని చెప్పిన జకా అష్రాఫ్‌.. తాజాగా ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తానని ప్రకటించారు. పాక్‌ వేదికగా నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో 9 మ్యాచ్‌ల నిర్వహణపై ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. దీంతో ప్రపంచ కప్‌లో పాక్‌ పాల్గొనడంపై కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

‘‘వ్యక్తిగతంగా హైబ్రిడ్ మోడల్‌ను నేను వ్యతిరేకించా. ఈ విధానం వల్ల పాక్‌ క్రికెట్‌కు ప్రయోజనం ఏమీ ఉండదని నా భావన. అందుకే, అది నాకిష్టం లేదు. అతిథ్య దేశంగా టోర్నీ నిర్వహణ ద్వారా పాకిస్థాన్‌కు మరిన్ని ప్రయోజనాలు దక్కాలి. ఇలా కాకుండా శ్రీలంకకు ఎక్కువ మ్యాచ్‌లను కేటాయించడం నాకు నచ్చలేదు. అయితే, ఇప్పటికే ఏసీసీ నిర్ణయం తీసేసుకుంది. కాబట్టి మేం దాని ప్రకారమే ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని అడ్డుకోవడం కానీ, నిరోధించడం కానీ చేయలేను. అందుకే, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా.  ఇక నుంచైనా మేం మా దేశ ప్రయోజనాల కోసం ప్రతి నిర్ణయం ఉండేలా చూస్తాం’’ అని జకా వెల్లడించారు.  ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని