CWC Qualifiers: స్కాట్లాండ్‌ను గెలిపించిన మైకేల్ లీస్క్.. చివరి బంతి వరకూ తప్పని ఉత్కంఠ

వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్ శుభారంభం చేసింది. గ్రూప్‌-బిలో ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చివరి బంతి వరకు పోరాడి ఒక వికెట్‌ తేడాతో విజయం సాధించింది.

Published : 21 Jun 2023 21:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్ శుభారంభం చేసింది. గ్రూప్‌-బిలో ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చివరి బంతి వరకు పోరాడి ఒక వికెట్‌ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని స్కాట్లాండ్ 9 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది. మైకేల్ లీస్క్ (91; 61 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) గొప్పగా పోరాడి జట్టుకు విజయాన్ని అందించాడు. క్రిస్టోఫర్ మెక్‌బ్రైడ్ (56), మార్క్‌ వాట్‌ (47) రాణించారు.

ఒక్క ఓవర్‌తో మలుపు తిరిగినా.. ఆఖర్లో ఉత్కంఠ 

లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ 46 ఓవర్లకు 243/8తో నిలిచింది. ఈ క్రమంలో చివరి నాలుగు ఓవర్లలో 43 పరుగులు చేయాల్సి ఉండటంతో అందరూ ఐర్లాండ్ గెలుపు ఖాయమే అనుకున్నారు. జాషువా లిటిల్‌ వేసిన 47వ ఓవర్‌తో మ్యాచ్‌ మలుపు తిరిగింది. ఈ ఓవర్లో మైకేల్ లీస్క్ వరుసగా 6,6,4,4 బాదడంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. తర్వాతి రెండు ఓవర్లలో 14 పరుగులు రావడంతో చివరి ఓవర్లో స్కాట్లాండ్ విజయానికి ఎనిమిది పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికే లీస్క్ ఫోర్ కొట్టడంతో రెండు, మూడు బంతులు మిగిలుండగానే స్కాట్లాండ్ విజయం సాధిస్తుందనుకున్నారు. తర్వాత మూడు బంతుల్లో ఒక పరుగే వచ్చి వికెట్ పడటంతో ఉత్కంఠ పెరిగిపోయింది. 3 బంతుల్లో రెండు పరుగులు అవసరమైన దశలో లెగ్‌బైస్‌ రూపంలో ఒక పరుగు రావడంతో లీస్క్‌ స్ట్రెకింగ్‌లోకి వచ్చాడు. ఒక బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో లీస్క్‌ ఫోర్ కొట్టి స్కాట్లాండ్‌కు విజయాన్ని అందించాడు. తొలుత 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఐర్లాండ్‌ను కర్టిస్ కాంఫర్‌ (120; 108  బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతక్కొట్టి ఆదుకున్నాడు. జార్జ్ డాక్రెల్ (69) అతడికి చక్కటి సహకారాన్ని అందించాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో బ్రాండన్ మెక్‌ముల్లెన్ (5/34) అదరగొట్టాడు. 

గ్రూప్‌-బిలో యూఏఈతో జరిగిన మరో మ్యాచ్‌లో ఒమన్‌ 5 వికెట్ల తేడాతో గెలిచింది. 228 పరుగుల లక్ష్యాన్ని 46 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. అకిబ్ ఇలియాస్ (53;75 బంతుల్లో), షోయజ్‌ ఖాన్ (52; బంతుల్లో), మహ్మద్ నదీమ్ (50; బంతుల్లో)  అర్ధ శతకాలతో మెరిశారు.  తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్లు ముహమ్మద్ వసీం (8), ముస్తాఫా (8) విఫలమవ్వగా.. ఆల్‌రౌండర్ అయాన్ ఖాన్ (58; 52 బంతుల్లో 10 ఫోర్లు), అర్వింద్ (49), రమీజ్ షాజాద్ (38) రాణించడంతో మోస్తరు స్కోరు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని