IND vs PAK: అప్పుడు నా బౌలింగ్‌ను అర్థం చేసుకోవడం వారికి కష్టమే: కుల్‌దీప్‌

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారత్ హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా పాక్‌ను చిత్తు చేసిన టీమ్‌ఇండియా (IND vs PAK) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వచ్చేసింది.

Updated : 15 Oct 2023 13:46 IST

ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్‌ వేదికగా పాక్‌తో (IND vs PAK) జరిగిన మ్యాచ్‌లో తొలుత బౌలర్లకు సహకారం లభించలేదని.. 270 పరుగులైనా ఛేజ్‌ చేసేందుకు అవకాశం ఉందని భారత క్రికెటర్ కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) తెలిపాడు. పాకిస్థాన్‌పై ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టిన కుల్‌దీప్‌ ఈ ప్రపంచ కప్‌లో అద్భుత బౌలింగ్‌తో అలరిస్తున్నాడు. అతడి బౌలింగ్‌లో స్వీప్‌ షాట్లకు యత్నించి మరీ బ్యాటర్లు పెవిలియన్‌కు చేరడం గమనార్హం. పాక్‌ బ్యాటర్ ఇఫ్తికార్‌ అహ్మద్‌ కూడా ఇలానే స్వీప్ షాట్‌ కొట్టేందుకు యత్నించి బౌల్డయ్యాడు. ఇఫ్తికార్‌ను ఔట్ చేసేందుకు ఏదైనా ప్లాన్‌ చేశారా..? అనే ప్రశ్నకు కుల్‌దీప్‌ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

‘‘ఇఫ్తికార్‌ కోసం ఎలాంటి ప్రణాళికలు వేయలేదు. లెగ్‌ స్టంప్‌ మీదుగా బంతిని విసరాలని ప్రయత్నించా. అయితే, గూగ్లీ పడింది. కానీ కాస్త దూరంగా పడిందనిపించింది. ఇలాంటి బాల్‌ను స్వీప్‌ చేయాలంటే చాలా కష్టం. అయితే, ఇఫ్తికార్‌ వికెట్‌ లక్కీగా వచ్చింది. దీంతో మిగతా వారిపై ఒత్తిడి పెరిగిపోయింది. నా చేతి నుంచి బంతి విడుదలయ్యేటప్పుడు బ్యాటర్లు అర్థం చేసుకోవడం కష్టం. దానిని మామూలు షాట్‌గా ఆడదామా..? స్వీప్‌ షాట్‌ కొడదామా..? అనే సందిగ్ధత కలుగుతుంది. 

స్వీప్ షాట్‌కు ప్రయత్నిస్తున్నారంటే వారికి ఆ షాట్ తెలిసి ఉంటుంది. అయితే ఎక్స్‌ట్రా బౌన్స్ అయిన బంతిని ఆడేందుకు వారు ఛాన్స్‌ తీసుకోరు. ఇదే విషయంపై నేను కెప్టెన్‌తో మాట్లాడా. అప్పుడే రెండు వికెట్లు ఒకే ఓవర్‌లో వచ్చాయి. సిరాజ్‌ బౌలింగ్‌లో బాబర్‌ వికెట్‌ రావడమే టర్నింగ్‌ పాయింట్. ఆ తర్వాత ఓకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడంతో  వారు కోలుకోలేకపోయారు. అయితే, ఇంత స్కోరుకే పరిమితం చేయాలని అనుకోలేదు. పిచ్‌ను బట్టి 270 పరుగులైనా ఛేదించవచ్చు. సింగిల్స్‌ చాలా సులువుగా వస్తాయి. వికెట్‌ తీయడమే చాలా కష్టం. ఫుల్లర్ డెలివరీలతో బ్యాటర్లు సులభంగా బౌండరీలు కొట్టేయగలరు. దీంతో లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్‌ చేశాం. మరీ ఎక్కువగా సీమ్‌కైనా, స్పిన్‌కైనా పిచ్‌నుంచి సహకారం లభించలేదు. అయితే, సింగిల్స్‌ను కట్టడి చేయడంతో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెరిగిపోయింది. ఆ తర్వాత వికెట్లు వాటంతటవే వచ్చేశాయి’’ అని కుల్‌దీప్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు