Kohli - Rohit: శాస్త్రి.. విరాట్‌ కోహ్లీకి చెప్పినట్టే రోహిత్‌ శర్మకు చెప్పగలడా..?

టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం జరుగుతోన్న మెగా టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో పూర్తిగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే...

Published : 11 May 2022 02:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం జరుగుతోన్న మెగా టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో పూర్తిగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో వారిద్దరి అభిమానులూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా కోహ్లీ దారుణంగా విఫలమవుతుండటంతో టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి.. కొద్ది రోజుల క్రితం ఓ స్టేట్‌మెంట్‌ చేశాడు. కోహ్లీ రెండు, మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. దీంతో అతడు తిరిగి జట్టులో చేరినప్పుడు మునుపటిలా ఉత్సాహంగా ఆడతాడని అభిప్రాయపడ్డాడు.

అయితే, తాజాగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విరాట్‌ మరోసారి గోల్డన్‌ డకౌట్‌ అవ్వడంతో అతడికి బ్రేక్‌ ఇవ్వాలనే విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ మ్యాచ్‌లో ప్రముఖ వ్యాఖ్యాత హర్షాభోగ్లే మాట్లాడుతూ కోహ్లీపై శాస్త్రి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్‌ స్పందిస్తూ.. ‘‘రోహిత్‌ శర్మ కూడా ఈ సీజన్‌లో బాగా ఆడట్లేదు. అలాంటప్పుడు కోహ్లీకి సూచించినట్లే అతడికి కూడా శాస్త్రి విశ్రాంతి తీసుకోవాలని చెబుతాడా..?’’ అని ప్రశ్నించాడు.

‘రోహిత్‌, కోహ్లీ ఎప్పుడూ క్రికెట్‌ ఆడుతూనే ఉంటారు. తరచూ టోర్నీలు జరుగుతూనే ఉంటాయి. ఆటగాళ్లు తమ మానసిక పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఆడాలి. ఈ విషయంలో కోహ్లీ చాలా మెరుగ్గా ఉన్నాడు. అతడెంతో కాలం నుంచి దాన్ని కొనసాగిస్తున్నాడు. ఏ ఆటగాడైనా సెలెక్టర్ల వద్దకు వెళ్లి.. నేను ఆడను. నన్ను ఎంపిక చేయకండి అని చెప్పరు. ప్రతి ఒక్కరూ జట్టులో ఉండాలనుకుంటారు. అయితే, మంచి ప్రదర్శన చేయనప్పుడు కాస్త ఇబ్బందులు పడటం సహజమే. ఫామ్‌లేమి నుంచి బయటపడటం కుదరదు’ అని హేడెన్‌ వివరించాడు. అయితే, చాలా కాలం పాటు శాస్త్రి.. కోహ్లీని దగ్గర నుంచి చూడటంతో అతడి మనసులో ఏముందో అర్థం చేసుకుంటాడని, అందుకే ఈ పాయింట్‌ లేవనెత్తానని భోగ్లే అన్నాడు. చివరగా సునీల్‌ గావస్కర్‌ స్పందిస్తూ.. ఏ ఆటగాడు విశ్రాంతి తీసుకున్నా.. అది టీమ్‌ఇండియాపై ప్రభావం చూపకూడదని అన్నాడు. ముందు భారత జట్టుకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని