WPL: అత్యంత వేగంతో దూసుకొచ్చిన బంతి.. మహిళా క్రికెట్‌లో రికార్డు

మహిళా క్రికెట్‌లో అత్యంత వేగంగా బంతిని విసిరి దక్షిణాఫ్రికా బౌలర్‌ చరిత్ర సృష్టించింది. 

Updated : 06 Mar 2024 11:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళల క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా బౌలింగ్‌ చేసి దక్షిణాఫ్రికా బౌలర్‌ షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ (Shabnim Ismail) రికార్డు సృష్టించింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ( WPL2024)లో గంటకు 132.1 కి.మీల (82.08 mph)వేగంతో బంతిని విసిరింది. 130 కి.మీలకి మించిన వేగంతో బౌలింగ్‌ చేయడం మహిళా క్రికెట్‌లో ఇదే తొలిసారి.  ముంబయి ఇండియన్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షబ్నిమ్‌ మార్చి 5న అరుణ్‌ జైట్లీ స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ సాధించింది.

మహిళా క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా ప్రశంసలు అందుకున్న ఆమె 2016లో వెస్టిండీస్‌పై 128 కి.మీలు, 2022 మహిళల ప్రపంచకప్‌లో 127 కి.మీల వేగంతో బౌలింగ్‌ చేసి రికార్డు నెలకొల్పింది. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షబ్నిమ్‌ దక్షిణాఫ్రికా తరఫున 8 టీ20 ప్రపంచ కప్పుల్లో ఆడింది. 16 ఏళ్ల కెరీర్‌లో 317 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టింది. మ్యాచ్‌ అనంతరం రికార్డు గురించి ప్రశ్నించగా తాను రికార్డులు పట్టించుకోనని, బౌలింగ్‌ చేసే సమయంలో పెద్ద స్క్రీన్‌ వైపు చూడనని తెలిపింది. 
ఈ మ్యాచ్‌లో తొలుత దిల్లీ 192 పరుగులు చేయగా ఛేదనలో ముంబయి 163 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని