Mumbai Indiansకు ప్రమాద ఘంటికలు

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ ఏటా ఆరంభంలో కాస్త తడబడినా తర్వాత బలంగా పుంజుకుంటుంది. కీలక సమయంలో చెలరేగి ప్రత్యర్థులను చిత్తు చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న 14వ సీజన్‌లోనూ...

Updated : 29 Apr 2021 12:18 IST

ప్రతి మ్యాచ్‌కు తగ్గుతున్న స్కోరు బోర్డు

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ ఏటా ఆరంభంలో కాస్త తడబడినా తర్వాత బలంగా పుంజుకుంటుంది. కీలక సమయంలో చెలరేగి ప్రత్యర్థులను చిత్తు చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న 14వ సీజన్‌లోనూ రోహిత్‌ టీమ్‌ కాస్త తడబడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇక్కడో విషయం గుర్తించాల్సిన అవసరముంది. అది ఆ జట్టు అభిమానులను కలవరపెట్టడమే కాకుండా ఒకరకంగా ప్రమాద ఘంటికలు కూడా మోగిస్తుంది. ముంబయి ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్‌ చేసి 159, 152, 150, 137, 131 ఈ స్కోర్లు సాధించింది. ఇవి గమనిస్తే స్కోరుబోర్డు ప్రతి మ్యాచ్‌కూ కిందకు దిగివచ్చిందే తప్ప పైకి వెళ్లలేదు. మిడిల్‌ ఆర్డర్‌లో బలమైన హిట్టర్లున్నా డెత్‌ ఓవర్లలో వాళ్లు పరుగులు చేయలేకపోతున్నారు. దాంతో చివర్లో ఎక్కువ పరుగులు రావాల్సింది పోయి తక్కువ స్కోర్లకే పరిమితమవుతోంది. మున్ముందు కూడా ఇలాగే ఆడితే రోహిత్‌సేనకు కష్టాలు తప్పవు.


తొలి స్కోరే ఎక్కువైందా?

డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌గా ఈ సీజన్‌లో అడుగుపెట్టిన ముంబయి ఇండియన్స్‌ తొలి పోరులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో పోటీపడింది‌. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 159/9 మోస్తరు స్కోర్‌ సాధించింది. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన క్రిస్‌లిన్‌(49; 35 బంతుల్లో 4x4, 3x6) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ పెద్దగా పరుగులు చేయలేదు. మిడిల్‌ ఆర్డర్‌లో హార్దిక్‌ పాండ్య(13), కీరన్‌ పొలార్డ్‌(7), కృనాల్‌ పాండ్య(7) విఫలమయ్యారు. దాంతో ముంబయి చివరి ఐదు ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 31 పరుగులే చేసింది. ఆపై బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి తొలి విజయాన్ని నమోదు చేసింది.


తడబడినా గెలిచింది..

రెండో పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడిన రోహిత్‌ సేన మళ్లీ టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసింది. కెప్టెన్‌ రోహిత్‌(43; 32 బంతుల్లో 3x4, 1x6), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌(56; 36 బంతుల్లో 7x4, 2x6) తప్ప మరెవరూ సరిగా ఆడలేదు. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రెండోసారి చేతులెత్తేశారు. దాంతో చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది. చివరికి 152 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో కోల్‌కతాకు శుభారంభం దక్కినా చివర్లో బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే ముంబయి 10 పరుగుల తేడాతో విజయం సాధించి గట్టెక్కింది.


మరోసారి అదే పరిస్థితి..
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడిన మూడో మ్యాచ్‌లోనూ టాస్‌ గెలిచిన ముంబయి తొలుత బ్యాటింగ్‌ చేసి 150/5 పరుగులు చేసింది. ఓపెనర్లు డికాక్‌(40; 39 బంతుల్లో 5x4), రోహిత్‌(32; 25 బంతుల్లో 2x4, 2x6) ఫర్వాలేదనిపించారు. తర్వాతి బ్యాట్స్‌మెన్‌ రాణించకపోయినా పొలార్డ్‌(35*; 22 బంతుల్లో 1x4, 3x6) కాసిన్ని మెరుపులు మెరిపించాడు. దాంతో చివరి ఐదు ఓవర్లలో ముంబయి 49 పరుగులు సాధించి రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. అనంతరం కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హైదరాబాద్‌ను 137 పరుగులకే కుప్పకూల్చి 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో ఈ సీజన్‌లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఒక్క మ్యాచ్‌లోనే ముంబయి చివరి ఐదు ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసింది.


మరింత దిగజారిన స్కోర్‌..

నాలుగో పోరులో ముంబయి ఇండియన్స్‌ దిల్లీ క్యాపిటల్స్‌తో పోటీపడింది. టాస్‌ గెలిచి మళ్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. అయినా స్కోరుబోర్డులో ఏమాత్రం మార్పులేకపోగా మరింత దిగజారింది. కెప్టెన్‌ రోహిత్‌(44; 30 బంతుల్లో 3x3, 3x6) ఒక్కడే రాణించాడు. సూర్యకుమార్‌(24), ఇషాన్‌ కిషన్‌(26) నిలకడగా ఆడినా పెద్ద స్కోర్లు సాధించలేకపోయారు. చివర్లో జయంత్‌ యాదవ్‌(23) కాసిన్ని పరుగులు చేయడంతో ఆఖరి ఐదు ఓవర్లలో ఆ జట్టు 36 పరుగులు సాధించి మూడు వికెట్లు కోల్పోయింది. దాంతో జట్టు స్కోర్‌ 137/9గా నమోదైంది. స్వల్ప లక్ష్యాన్ని దిల్లీ క్యాపిటల్స్‌ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.


ఇంకా తక్కువే..

(Photo: Surya Kumar Yadav Twitter)

పంజాబ్‌ కింగ్స్‌తో ఆడిన ఐదో మ్యాచ్‌లో ముంబయి టాస్‌ ఓడి బ్యాటింగే చేయాల్సి వచ్చింది. రోహిత్‌(63; 52 బంతుల్లో 5x4, 2x6), సూర్యకుమార్‌ యాదవ్‌(33; 24 బంతుల్లో 3x4, 1x6) ఇద్దరే రాణించారు. చివర్లో పొలార్డ్‌(16; 12 బంతుల్లో 1x6) బ్యాటింగ్‌ చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దాంతో ముంబయి ఆఖరి ఐదు ఓవర్లలో 34 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. అలా 20 ఓవర్లలో 131/6 పరుగులు చేసి ఈ సీజన్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. అనంతరం పంజాబ్‌ ఒక వికెట్‌ కోల్పోయి 17.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో ముంబయి తొలుత బ్యాటింగ్‌ చేయడం, స్కోరు బోర్డు తగ్గిపోవడం, ఆఖరి ఓవర్లలో వికెట్లు కోల్పోతూ పరుగులు చేయకపోవడం జరిగాయి. ఇకపై మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించకపోతే తర్వాత జట్టు పరిస్థితి ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని