Ruturaj Gaikwad: రుతురాజ్‌ ఫామ్‌పై ఆందోళన లేదు: చెన్నై బౌలింగ్‌ కోచ్‌ ఎరిక్‌

Ruturaj Gaikwad: చెన్నై సారథి రుతురాజ్‌ ఫామ్‌పై తమకు ఎలాంటి ఆందోళన లేదని ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ ఎరిక్‌ సైమన్స్‌ అన్నాడు. అతడు నాణ్యమైన ఆటగాడని తెలిపాడు.

Published : 08 Apr 2024 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు చేపట్టిన యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) వ్యక్తిగతంగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఓపెనర్‌గా గత సీజన్లలో చెన్నైకి మంచి ఆరంభాలు అందించిన అతడు.. ఇప్పుడు ఆ ఫామ్‌ను కొనసాగించలేకపోతున్నాడు. దీనిపై జట్టు బౌలింగ్‌ కోచ్‌ ఎరిక్‌ సైమన్స్‌ స్పందిస్తూ సారథికి అండగా నిలిచాడు.

‘‘రుతురాజ్‌ ఫామ్‌పై మేం పెద్దగా ఆందోళన చెందడం లేదు. అతడు నాణ్యమైన ఆటగాడు. అయితే పోటీ క్రికెట్‌లో మరింత విశ్వాసంతో రిస్క్‌ తీసుకుని ఆడాల్సిన అవసరం ఉంది. అతడు అలాంటి వ్యక్తే. కెప్టెన్‌గా, ఆటగాడిగా అతడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. తాను ఏం చేయాలనుకుంటున్నాడో దానిపై పూర్తి దృష్టి పెట్టాడు’’ అని సైమన్స్‌ అన్నాడు.

చెన్నైతో కష్టమే.. భారత్‌లో ధోనీని మించిన కెప్టెన్‌ లేడు: గౌతమ్‌ గంభీర్‌

ఇక, రచిన్‌ రవీంద్రతో రుతురాజ్‌ ఓపెనింగ్‌ భాగస్వామ్యం గురించి స్పందిస్తూ.. ‘‘తొలి రెండు మ్యాచ్‌ల్లో మాకు మంచి ఆరంభం దక్కింది. ఆ తర్వాత రెండు గేమ్స్‌ అంతగా కలిసిరాలేదు. అయినప్పటికీ మాకు టాప్‌ ఆర్డర్‌లో ఇద్దరు మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకు వారిద్దరూ కలిసి నాలుగు మ్యాచ్‌లే ఆడారు. ముందుముందు వారి ఓపెనింగ్‌ భాగస్వామ్యం బలపడుతుంది’’ అని తెలిపాడు.

2021 సీజన్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్న రుతురాజ్‌.. ఈ సీజన్‌లో ఓపెనర్‌గా పెద్దగా రాణించలేదు. గత నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 88 పరుగులే చేయగలిగాడు. ఇందులో ఒకే ఒక్కసారి అతడి స్కోరు 40 దాటింది. పవర్‌ ప్లేలో అతడి నుంచి భారీ హిట్టింగ్‌లు లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక, ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు విజయాలు, రెండు ఓటములతో ఉన్న చెన్నై.. సోమవారం కోల్‌కతాతో తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని