Ashwin-Gavaskar: అశ్విన్‌ ‘జస్ట్‌ కొలీగ్స్‌’ వ్యాఖ్యలు.. అదే కారణమన్న సునీల్ గావస్కర్‌!

మైదానంలో కలిసి ఆడినా, ప్రత్యర్థులుగా బరిలోకి దిగినా కొందరు ఆటగాళ్ల మధ్య స్నేహబంధం కొనసాగుతుంది. స్వదేశీ, విదేశీ అనే తేడా లేకుండా స్నేహితులుగా మారిపోతారు.

Published : 11 Jul 2023 10:38 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టీమ్‌ఇండియా ఆటగాళ్లతో సంబంధాలపై సీనియర్‌ ప్లేయర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin) చేసిన వ్యాఖ్యలు నిరుత్సాహానికి గురి చేశాయని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) వ్యాఖ్యానించాడు. కొన్నేళ్లపాటు జట్టుకు ఆడిన ఆటగాళ్లు స్నేహితులుగా మారతారు. విదేశీ క్రికెటర్లతోనూ మన ఆటగాళ్లలో కొందరు స్నేహబంధం కొనసాగిస్తున్నవారున్నారు. తమ తరం క్రికెటర్లు మైదానం వెలుపలా సన్నిహితంగా ఉంటూ ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకుంటూ ఉండేవారని సునీల్ గావస్కర్ గుర్తు చేసుకున్నారు. ఇప్పటి వారిలో అలాంటి ధోరణి లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించాడు.

‘‘ఆట ముగిసిన తర్వాత ప్లేయర్లు తమ సహచరులతో ఇష్టమైనవాటి గురించి మాట్లాడుకోవాలి. మ్యూజిక్, సినిమాలు.. ఇలాంటి విషయాలను పంచుకోవాలి. అయితే, అశ్విన్‌ అలా వ్యాఖ్యానించడం నన్ను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. గత 20 ఏళ్ల నుంచి ఆటగాళ్లకు వేర్వేరుగా గదులను కేటాయించడం కూడా ఓ కారణమై ఉంటుంది. మా కాలంలో ఇతర ఆటగాడితో గదిని పంచుకోవడం వల్ల ఒకరితో మరొకరు అన్ని అంశాల గురించి చర్చించుకునేవాళ్లం’’ అని సునీల్ గావస్కర్‌ తెలిపాడు. 

అశ్విన్‌ ఏమన్నాడంటే..? 

ప్రస్తుత తరంలో క్రికెటర్‌ ఒంటరి అనే భావనతో ఎందుకు ఉన్నాడనేది అశ్విన్‌ వివరించాడు. ‘‘ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లు స్నేహితులుగా ఉండేవారు. ఇప్పుడు మాత్రం కేవలం కొలీగ్స్ మాత్రమే. గతానికి, ప్రస్తుతానికి అదే వ్యత్యాసం.ఇప్పుడున్న క్రికెటర్లు తమ పక్కన ఉన్నవారికంటే ముందుకు ఎలా వెళ్లాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారి పక్కన ఉన్న వారిని కనీసం ‘ఇంకేంటి బాస్‌, ఏం చేస్తున్నావు’ అని అడగానికి ఎవరికీ సమయం కూడా ఉండటం లేదు’’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. బుధవారం నుంచి విండీస్‌తో భారత్‌ రెండు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది.  ఈ క్రమంలో భారత క్రికెటర్ల మధ్య సంబంధాలపై సోషల్ మీడియా వేదికగా కొత్త చర్చకు తెరలేచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని