Ravindra Jadeja: స్క్రిప్ట్‌ ప్రకారమే మా నాన్న ఇంటర్వ్యూ.. వాటిని పట్టించుకోవద్దు: రవీంద్ర జడేజా

తాజాగా 15 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌ను పూర్తి చేసుకున్న రవీంద్ర జడేజాకు (Ravindra Jadeja) తండ్రి నుంచే విమర్శలు రావడం గమనార్హం. దీంతో జడ్డూ వెంటనే సోషల్ మీడియా వేదికగా ప్రతిస్పందించాడు. 

Published : 09 Feb 2024 20:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తన తండ్రి చేసిన ఆరోపణలపై భారత స్టార్‌ క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) స్పందించాడు. అవన్నీ నిరాధార, కల్పిత స్క్రిప్ట్‌ ప్రకారం చేసిన వ్యాఖ్యలుగా కొట్టిపడేశాడు. ఈమేరకు  తన సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ‘‘ ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు అర్థం లేనివి. అన్నీ అవాస్తవాలే. కేవలం ఒకవైపు నుంచి చూస్తే సరిపోదు. వాటిని నేను ఖండిస్తున్నా. నా భార్య ప్రతిష్ట దిగజార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు అభ్యంతరకరం.  అసభ్యకరమైనవి. నేను కూడా చాలా విషయాలు చెప్పగలను. కానీ, అవేవీ పబ్లిక్‌లో వెల్లడించడం సరైంది కాదు. ఇంటర్వ్యూ అంతా స్క్రిప్ట్‌ ప్రకారమే సాగినట్లు ఉంది. వాటిని పట్టించుకోవద్దు’’ అని జడేజా ఆ పోస్టులో రాసుకొచ్చాడు. 

జడేజా తండ్రి ఏం చెప్పారంటే? 

రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్‌ సిన్హ్‌ జడేజా ప్రస్తుతం జామ్‌నగర్‌లో ఒంటరిగా ఉంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మీరు ఓ నిజం చెప్పమని నన్ను అడిగారు. ఇప్పుడు నా కుమారుడు, అతడి భార్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మేం వారిని ఎప్పుడూ పిలవం. అలాగే వారూ మమ్మల్ని పిలవరు. జడేజా వివాహం జరిగిన రెండు, మూడు నెలలకే ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు నేను జామ్‌నగర్‌లో ఒక్కడినే ఉంటున్నా. రవీంద్ర వేరుగా ఉంటున్నారు. ఒకే నగరంలో ఉన్నా మా మధ్య దూరమే ఉంది. ఎందుకో నాకూ తెలియదు. అతడు నా కుమారుడు. కానీ, నా మనసు బాధ పెట్టాడు. నేను ఏదీ దాచాలని అనుకోలేదు. గత ఐదేళ్లలో నేను ఎప్పుడూ నా మనవరాలిని చూడలేదు’’ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో రవీంద్ర జడేజా ప్రకటన చేశాడు. ప్రస్తుతం జడేజా గాయం కారణంగా ఎన్‌సీఏలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని