Rohit Sharma: అరుదైన ఘనత సాధించిన రోహిత్‌ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా రికార్డు..

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఆరు సిక్స్‌లు బాది పలు రికార్డులను నమోదు చేశాడు. 

Updated : 15 Oct 2023 03:03 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా (Team India) జైత్రయాత్ర కొనసాగుతోంది. అహ్మదాబాద్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ (Pakistan) తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బంతితో అదరగొట్టి పాకిస్థాన్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేసిన టీమ్‌ఇండియా..బ్యాటింగ్‌లోనూ సత్తాచాటింది. పాక్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలోనే ఛేదించి ఈ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. అంతేకాదు ప్రపంచకప్‌లో పాక్‌పై ఓటమి ఎరుగని రికార్డు(8 మ్యాచ్‌లు)ని పదిలం చేసుకుంది. అఫ్గానిస్థాన్‌పై సెంచరీ బాదిన రోహిత్‌ శర్మ (Rohit Sharma).. ఈ మ్యాచ్‌లోనూ చెలరేగాడు. అతడు 63 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 86 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

ఈ మ్యాచ్‌లో ఆరు సిక్స్‌లు బాదిన హిట్‌మ్యాన్‌ అరుదైన ఘనత అందుకున్నాడు. వన్డేల్లో 300 సిక్స్‌లు బాదిన అతి తక్కువమంది ఆటగాళ్ల క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత అందుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రోహిత్‌ కంటే ముందు షాహిద్‌ అఫ్రిది, క్రిస్‌ గేల్ వన్డేల్లో 300 సిక్స్‌లు బాదారు. ప్రస్తుతం అఫ్రిది (351), క్రిస్‌ గేల్ (331) రెండు స్థానాల్లో ఉండగా.. రోహిత్ శర్మ (303) మూడో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్‌ మరి కొన్నాళ్లు ఆడితే ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ఖాయం. ఆసక్తికర విషయం ఏంటంటే.. రోహిత్‌కు దారిదాపుల్లో ఏ ఆటగాడు కూడా లేడు. 

తొలి భారత కెప్టెన్‌గా 

ఈ మ్యాచ్‌లో 86 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2019 ప్రపంచకప్‌లో మాంచెస్టర్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 77 పరుగులు చేశాడు. 

సిక్స్‌ల్లో మరో రికార్డు

ఈ మ్యాచ్‌లో ఆరు సిక్సర్లు బాదడం ద్వారా రోహిత్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక సార్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. రోహిత్‌ మూడుసార్లు ఈ ఘనత అందుకోగా.. సచిన్ రెండుసార్లు ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ప్రపంచకప్‌ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డు సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు రోహిత్‌. అతని కంటే ముందు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్‌ ఈ ఫీట్ సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని