
IND vs SA: దంచికొట్టిన రిషభ్ పంత్.. దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం
పార్ల్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో అతిథ్య జట్టుకు టీమ్ఇండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. యువ ఆటగాడు రిషభ్ పంత్ (85; 71 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ కేఎల్ రాహుల్ (55; 79 బంతుల్లో 4 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. అయితే తొలి వన్డేలో అదరగొట్టిన విరాట్ కోహ్లీ... ఈ రోజు డకౌట్ అయ్యి (0) నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షంసి రెండు, మగళ, కేశవ్ మహారాజ్, మార్క్రమ్, పెహులుక్వాయో తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కి ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని ముందుకు కదిలించారు. ఈ క్రమంలో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమ్ఇండియా స్కోరు 57/0గా నమోదైంది. ఆ తర్వాత భారత్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. 12 ఓవర్లో శిఖర్ ధావన్ (29)ని మార్క్రమ్ పెవిలియన్‌కి పంపాడు. ఆ తర్వాతి ఓవర్లో కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (0) బవుమాకి చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ దూకుడుగా ఆడాడు.
వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డు వేగం పెంచాడు. షంసీ వేసిన 24 ఓవర్లో పంత్ మూడు ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే 43 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తర్వాత కూడా పంత్ అదే జోరుని కొనసాగించాడు. 29 ఓవర్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ కొద్దిసేపటికే పెలివియన్ చేరాడు. ఆ వెంటనే రిషబ్ పంత్‌ని షంసి ఔట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ (11), వెంకటేశ్ అయ్యర్ (22) వేగంగా ఆడలేకపోయారు. అలా అని ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. చివర్లో శార్దూల్ ఠాకూర్ (40*), అశ్విన్ (25*) నిలకడగా ఆడి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.