Team India: డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌.. బంగ్లాపై విజయంతో మెరుగైన టీమ్‌ఇండియా ర్యాంకు

తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్‌ 188 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా రెండో స్థానానికి ఎగబాకింది. 

Published : 18 Dec 2022 18:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. తొలి టెస్టులో 188 పరుగులు తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యం సంపాదించింది. ఈ విజయంతో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (ICC Test Championship) ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా (Team India) తన ర్యాంకును మెరుగుపరుచుకుని రెండో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌ జరగడానికి ముందు భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన దక్షిణాఫ్రికా.. మూడో స్థానానికి పడిపోయింది. ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో ఉంది. ఈ పాయింట్ల పట్టికలో ఆసీస్‌ పాట్‌ కమిన్స్‌ నాయకత్వంలోని ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక, ఇంగ్లాంఢ్‌, పాకిస్థాన్‌.. వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఈ పాయిట్ల పట్టికలో టాప్‌-2లో నిలిచిన జట్ల మధ్యే టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. 

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు విషయానికొస్తే.. టీమ్‌ఇండియా నిర్దేశించిన 513 పరుగుల లక్ష్య  ఛేదనలో బంగ్లాదేశ్‌ 324 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 404 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బంగ్లా 150కు కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 258/2 వద్ద భారత్‌ డిక్లేర్డ్‌ చేసింది. ఐదో రోజు ఆట ప్రారంభమైన 50 నిమిషాల్లోపే బంగ్లాదేశ్‌ కేవలం 52 పరుగులే చేసి చివరి నాలుగు వికెట్లను కోల్పోయి ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను అక్షర్ పటేల్ (4/77), కుల్‌దీప్‌ యాదవ్ (3/73) కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్‌ తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన కుల్‌దీప్‌ యాదవ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు’ అందుకొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని