WhatsApp: ఈ మూడు ఫీచర్లూ వస్తే.. వావ్‌!

వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తున్న వాట్సాప్ తాజాగా మొబైల్, డెస్క్‌టాప్ వెర్షన్స్‌లో మరికొన్ని కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేయనుంది. వ్యూ వన్స్, మీడియా అప్‌లోడ్ క్వాలిటీ, మల్టీ డివైజ్ సపోర్ట్, రీడ్ లేటర్ వంటి ఫీచర్స్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.... 

Updated : 15 Jul 2021 12:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తున్న వాట్సాప్ తాజాగా మొబైల్, డెస్క్‌టాప్ వెర్షన్స్‌లో మరికొన్ని కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేయనుంది. వ్యూ వన్స్, మీడియా అప్‌లోడ్ క్వాలిటీ, మల్టీ డివైజ్ సపోర్ట్, రీడ్ లేటర్ వంటి ఫీచర్స్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిలో కొన్ని ఫీచర్స్ బీటా యూజర్స్‌ కోసం అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని ఫీచర్స్ పరీక్షల దశలో ఉన్నాయని, త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. మరి త్వరలో విడుదలకానున్న ఆ ఫీచర్స్ ఏంటో చూద్దాం.


వాయిస్‌ మెసేజ్‌ కొత్త ఫీచర్

వాయిస్‌ మెసేజ్‌లకు సంబంధించి వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఇప్పటి వరకు మనం పంపే వాయిస్‌ మెసేజ్‌లను రికార్డ్ చేసిన వెంటనే పంపేవాళ్లం. త్వరలో రానున్న ఫీచర్‌ సాయంతో వాయిస్‌ మెసేజ్‌లను రికార్డ్‌ చేసి, యూజర్ విన్న తర్వాత అవతలి వారికి పంపొచ్చు. దీని వల్ల మనం రికార్డు చేసిన మెసేజ్‌లో ఏమైనా మార్పులు ఉంటే సదరు ఆడియో మెసేజ్‌ని డిలీట్ చేసి కొత్త మెసేజ్‌ను రికార్డ్ చేసి పంపే సదుపాయం ఉంటుంది. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ యూజర్స్‌ త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.


రివ్యూ బ్యాన్స్‌

వాట్సాప్‌ ఖాతాల ద్వారా ఎవరైనా తప్పుడు లేదా చట్ట వ్యతిరేకమైన సమాచారం వ్యాపింపజేస్తున్నట్లు గుర్తిస్తే వాట్సాప్‌ ఆటోమేటెడ్ సిస్టంలు సదరు ఖాతాలను బ్లాక్ చేస్తాయి. కొన్నిసార్లు వాట్సాప్‌ ఆటోమేటెడ్ సిస్టం పనితీరు కారణంగా తప్పుడు సమాచార వ్యాప్తితో సంబంధంలేని వ్యక్తుల ఖాతాలకు కూడా నిషేధానికి గురవుతున్నాయి. దీంతో యూజర్స్ వాట్సాప్ ఆటోమెటేడ్ సిస్టం పనితీరుపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ రివ్యూ బ్యాన్స్/రిక్వెస్ట్‌ ఏ రివ్యూ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఒకవేళ మీ ఖాతాను వాట్సాప్ ఆటోమెటేడ్ సిస్టం బ్లాక్ చేస్తే మీరు రివ్యూకి వెళ్లొచ్చు. అలా మీరు రివ్యూ కోరిన వెంటనే మీకు ఇన్-యాప్ నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత 24 గంటల్లో మీ ఖాతాను రివ్యూ చేసి సమస్యను పరిష్కరిస్తారు. ఒకవేళ మీ ఖాతాను పొరపాటున బ్యాన్ చేస్తే ఖాతాలోని ఛాట్ హిస్టరీ తొలగించకుండా తిరిగి యాక్టివేట్ చేస్తారు. 


గ్రూప్ కాలింగ్ కొత్త యూఐ

వాయిస్/వీడియో కాల్స్‌లో వాట్సాప్ కొన్ని ముఖ్యమైన మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా గ్రూప్ కాలింగ్‌కు కొత్త యూజర్‌ ఇంటర్‌ఫేస్‌తోపాటు గ్రూప్ కాల్‌ ప్రారంభమయిన తర్వాత కాల్ మధ్యలో జాయిన్ అయ్యేలా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. మీకు గ్రూప్‌ కాలింగ్‌లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది, కానీ ఆ సమయంలో మీరు వేరే పనిలో బిజీగా ఉండి కాల్‌లో జాయిన్ అయ్యేందుకు కుదరలేదు. కొంత సమయం తర్వాత మీరు వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు కాల్ ఇంకా కొనసాగుతుంటే..మీరు కాల్‌లో జాయిన్ కావచ్చు. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న ఈ ఫీచర్‌ బీటా వెర్షన్‌ని త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఐఓఎస్‌ యూజర్స్ మాత్రం మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని వాబీటాఇన్ఫో పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని