ఎడారిలో జంతు దయ

మనిషికి మనిషి తోడు. ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకుంటూ ముందుకు సాగటం చూస్తూనే ఉంటాం. మరి జంతువులేం తక్కువా?...

Published : 12 May 2021 00:10 IST

మనిషికి మనిషి తోడు. ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకుంటూ ముందుకు సాగటం చూస్తూనే ఉంటాం. మరి జంతువులేం తక్కువా? అవీ ఒకదానికి మరొకటి సాయం చేసుకుంటూ కష్టకాలంలో ఆపదలను ఎదుర్కొంటూ ఉంటాయి. కావాలంటే ఈ గుర్రాలు, గాడిదలనే చూడండి. ఇవి ఎడారిలో జంతువులకే కాదు, మొక్కలకూ తమ వంతు సాయం చేస్తున్నాయి మరి.

వ్యవసాయం దగ్గర్నుంచి, రవాణా అవసరాల వరకూ గుర్రాలు, గాడిదలు మనకు రకరకాలుగా ఉపయోగపడుతుంటాయి. వేలాది సంవత్సరాలుగా మనం వీటి సేవలను వినియోగించుకుంటూనే ఉన్నాం. మనకు తెలిసింది ఇంతవరకే. కానీ ఇవి ఎడారుల్లో.. ముఖ్యంగా తీవ్ర వేసవిలో జంతువులు, మొక్కలకు తోడ్పడుతుండటం గమనార్హం. ఎలాగో తెలుసా? లోతైన గోతుల వంటి బావులు తవ్వటం ద్వారా! ఇలా జంతువులకు, మొక్కలకు అవసరమైన నీటిని అందుబాటులో ఉంచుతున్నాయన్నమాట. ఎరిక్‌ లండ్‌గ్రెన్‌ అనే జీవశాస్త్రవేత్త దక్షిణ అరిజోనాలో పనిచేస్తున్న సమయంలో మొట్టమొదటిసారి ఈ విషయాన్ని గుర్తించారు. సాధారణంగా ఆఫ్రికా ఏనుగులు లోతైన గోతులు, బావులు తవ్వుతూ ఇతర జంతువులకు సాయం చేస్తుంటాయి. గుర్రాలు, గాడిదలు కూడా ఇలాగే చేస్తాయా? అనే సందేహం వచ్చింది ఆయనకు. వెంటనే రంగంలోకి దిగి పరిశోధన చేయగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కాలువలు, నదుల్లో నీరు అందుబాటులో లేని సమయంలో ఇవి 6 అడుగుల లోతు వరకు బావులు తవ్వుతుండటం విశేషం. దీంతో చుట్టుపక్కల జంతువులకు, మొక్కలకు తగినంత నీరు అందుబాటులోకి వస్తోంది. జింకల వంటివన్నీ దీన్ని తాగుతూ హుషారుగా గెంతులేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటోందని పరిశోధకులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల వంటివి సహజ వనరుల లభ్యతను దెబ్బతీస్తున్న తరుణంలో జంతువులు ఇలా కారుణ్య దృక్పథాన్ని ప్రదర్శిస్తుండటం నిజంగా గొప్ప విషయమే. గుర్రాలు, గాడిదల ప్రస్తుత ప్రవర్తనకు అనాది కాలంలోనే పునాది పడి ఉండొచ్చన్నది పరిశోధకుల భావన.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని