పీసీలో విద్యుత్తు సమస్యలా?

మనం పనిచేయటానికి శక్తి ఎంత అవసరమో, పీసీకి విద్యుత్తూ అంతే. ఇది సజావుగా అందితేనే డెస్క్‌టాప్‌ సక్రమంగా నడుస్తుంది. పీఎస్‌యూ (పవర్‌ సప్లయింగ్‌ యూనిట్‌) చేతులెత్తేస్తే పీసీ కూడా పడకేస్తుంది.

Updated : 12 Oct 2022 03:19 IST

మనం పనిచేయటానికి శక్తి ఎంత అవసరమో, పీసీకి విద్యుత్తూ అంతే. ఇది సజావుగా అందితేనే డెస్క్‌టాప్‌ సక్రమంగా నడుస్తుంది. పీఎస్‌యూ (పవర్‌ సప్లయింగ్‌ యూనిట్‌) చేతులెత్తేస్తే పీసీ కూడా పడకేస్తుంది. ఏదైనా పేలినట్టు శబ్దం వచ్చినా, పీసీ వెనక పీఎస్‌యూ ఫ్యాన్‌ నుంచి పొగ వెలువడినా ఏదో సమస్య తలెత్తిందని తెలుసుకోవటం బ్రహ్మవిద్యేమీ కాదు. కానీ అన్నిసార్లూ సమస్య ఇలా వెంటనే, ఉన్నట్టుండి స్పష్టంగా కాకపోవచ్చు. నిజానికి పీఎస్‌యూ వైఫల్యంతో ముడిపడిన సమస్యలు ఇతరత్రా సాఫ్ట్‌వేర్‌ ఇబ్బందులుగానూ పొరపడేలా చేస్తుంటాయి. మరి పీఎస్‌యూ సరిగా పనిచేయటం లేదనే విషయాన్ని గుర్తించటమెలా? ఇందుకు కొన్ని లక్షణాలు లేకపోలేదు.


కంప్యూటర్‌ కేస్‌ షాక్‌ కొట్టటం

కంప్యూటర్‌ కేసును చేత్తో తాకినప్పుడు షాక్‌ కొట్టినట్టు అనిపిస్తే నిర్లక్ష్యం చేయరాదు. అలాగే సీపీయూకు తగిలించిన యూఎస్‌బీల వంటివి షాక్‌ కొట్టినా ఏదో సమస్య ఉందనే అర్థం.  

షట్‌డౌన్‌, రీస్టార్ట్‌ కావటం

పాత పడిన, సరిగా పనిచెయ్యని పీఎస్‌యూ మూలంగా సిస్టమ్‌ అప్పుడప్పుడు హఠాత్తుగా షట్‌  డౌన్‌ కావొచ్చు. దానికదే రీస్టార్ట్‌ కావొచ్చు. దీనికి సిస్టమ్‌ వేడెక్కటం వంటి కారణాలు చాలానే ఉండొచ్చు. పీఎస్‌యూకి దుమ్ముపట్టటం లేదా దీనిలోని భాగాలు సరిగా పనిచెయ్యకపోటం, కెపాసిటర్లు మందగించటం, అప్పుడప్పుడు విద్యుదాఘాతం తలెత్తటం వంటివి వీటికి దోహదం చేయొచ్చు.


బ్లూ స్క్రీన్‌ వంటి ఎర్రర్లు

పీసీ మీద ఆసక్తిగా ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఉన్నట్టుండి బ్లూ స్క్రీన్‌ ఎర్రర్‌ వస్తే ఎవరికైనా చిరాకు కలుగుతుంది. పీఎస్‌యూ సమస్యలతో విద్యుత్తు అందకపోయినప్పుడు, వోల్టేజీ తగ్గినప్పుడు పీసీ భాగాలు విచిత్రంగా ప్రవర్తించటం వల్ల ఇలాంటి ఎర్రర్లు మరింత ఎక్కువ అవుతాయి కూడా. బ్లూ స్క్రీన్‌ ఎర్రర్లకు కారణమేంటన్నది గుర్తించటానికి ట్రబుల్‌ షూట్‌తో ప్రయత్నించినా అసలు సమస్య బయటపడకపోవచ్చు. పీఎస్‌యూను పరీక్షించి విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా అవుతుందో లేదో చూడటమే మార్గం.


బూట్‌ స్టార్ట్‌లో ఇబ్బంది

బ్యాటరీ పాతపడితే కారు త్వరగా స్టార్ట్‌ కాదు కదా. అలాగే పాత పీఎస్‌యూ కూడా పీసీ స్టార్ట్‌ కావటానికి ఆడ్డుతగులుతుంటుంది. పీఎస్‌యూ ఆన్‌ అయ్యాక కంప్యూటర్‌లోని అన్ని భాగాలకు తగినంత విద్యుత్తు అందటానికి మధ్య పట్టే సమయాన్ని పీజీ (పవర్‌ గుడ్‌) కొలమానంగా భావిస్తారు. సాధారణంగా ఈ సమయం అర సెకండు కన్నా తక్కువగా ఉండాలి. ఇది ఏమాత్రం ఎక్కువ అవుతున్నా బూట్‌ సమస్యలు మొదలవుతాయి. బూట్‌ లూప్‌లో చిక్కుకుపోవచ్చు. దీంతో బూట్‌ ప్రక్రియ, ఓఎస్‌ పూర్తిగా లోడ్‌ కాకముందే పీసీ క్రాష్‌ అవుతుంది.


ఫ్యాన్‌ ఫెయిల్‌ కావటం

ఫ్యాన్‌ ఎప్పటికప్పుడు కూల్‌ చేస్తుంటుంది కాబట్టి పీఎస్‌యూలు చల్లగా ఉంటాయి. మామూలుగానైతే ఫ్యాన్‌ పెద్దగా చప్పుడు చేయదు. ఒకవేశ పెద్దగా, గరగరమని చప్పుడు చేస్తే ఫ్యాన్‌ దెబ్బతిన్నదనే అర్థం. ఇది సరిగా పనిచేయటం లేదంటే పీఎస్‌యూను మార్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందనే అనుకోవచ్చు. అయితే పొరపాటున కూడా సొంతంగా ఫ్యాన్‌ను మరమ్మత్తు చేయటానికి గానీ తొలగించటానికి గానీ ప్రయత్నించొద్దు. ప్రామాణిక కనెక్టర్‌ లేకపోయినా, పీఎస్‌యూ పక్కనుండే ఇంటర్నల్‌ బోర్డుకు నేరుగా సోల్డర్‌ చేసి ఉన్నా షాక్‌ కొట్టే ప్రమాదముంది.

* ఫ్యాన్‌ ఒక్కటే కాదు, పీఎస్‌యూలోని పెద్ద విడిభాగాలు పెద్ద శబ్దం చేస్తున్నా అనుమానించాలి.


లోడ్‌ పెరిగితే షట్‌ డౌన్‌ కావటం

పీఎస్‌యూ పాత పడుతున్నకొద్దీ అది విఫలం కాకపోయినా కూడా సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. పీసీలో ఒకేసారి ఎక్కువ పనులు చేస్తున్నప్పుడు పడే లోడ్‌ను తట్టుకోలేకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో పీసీలోని పాత భాగాలు, కెపాసిటర్లు మునుపటిలా పనిచేయలేకపోవచ్చు. వెబ్‌ బ్రౌజ్‌ చేయటం, కథనాలు చదవటం వంటి తేలికైన పనులు చేస్తున్నప్పుడు పీసీ బాగానే ఉండొచ్చు గానీ గేమ్స్‌ ఆడటం వంటి అత్యధిక వేగం, లోడ్‌తో ముడిపడిన పనులు చేస్తున్నప్పుడు కుంటుపడొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని