ఇమేజ్‌ సుస్పష్టం

కృత్రిమ మేధ (ఏఐ) రాకతో సాంకేతిక రంగం శరవేగంగా పుంజుకుంటోంది. పనులు సులభంగా, సమర్థంగా చేసి పెట్టటానికి వినూత్న టూల్స్‌ ఎన్నో పుట్టుకొస్తున్నాయి.

Updated : 20 Dec 2023 01:21 IST

కృత్రిమ మేధ (ఏఐ) రాకతో సాంకేతిక రంగం శరవేగంగా పుంజుకుంటోంది. పనులు సులభంగా, సమర్థంగా చేసి పెట్టటానికి వినూత్న టూల్స్‌ ఎన్నో పుట్టుకొస్తున్నాయి. అలాంటిదే ‘మ్యాగ్నిఫిక్‌ ఏఐ’. ఇది ఇమేజ్‌ల నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. తక్కువ రెజల్యూషన్‌ చిత్రాలను హై-డెఫినిషన్‌లోకి ఇట్టే మార్చేస్తుంది. పదాల రూపంలో తగిన ప్రాంప్ట్‌లను అందిస్తే చాలు, పని పూర్తి చేస్తుంది. ఫొటోగ్రాఫర్లకు, గ్రాఫిక్‌ డిజైనర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు. దీనిలోని క్రియేటివిటీ స్లైడర్‌ అప్పటివరకు ఫొటోలో మసక మసకగా కనిపించే వివరాలనూ సుస్పష్టం చేసేస్తుంది. నైపుణ్యం గలవారే కాదు.. అన్నిరకాల వాళ్లూ తేలికగా ఉపయోగించు కునేలా మ్యాగ్నిఫిక్‌ ఏఐ టూల్‌ను రూపొందించారు. వీడియోగేమ్స్‌, సినిమా ఇమేజ్‌ల నాణ్యతనూ మెరుగుపరుస్తుంది.https://magnific.ai/


ఫొటోలతో యానిమేషన్‌

 నిశ్చల ఫొటోలకు భావాలు పలికించే విద్య ప్రసాదిస్తోంది ‘రన్‌వే ఎంఎల్‌’. దీనిలోని మోషన్‌ బ్రష్‌ టూల్‌ ఎంచుకున్న ఫొటోలతో యానిమేషన్‌ చిత్రాన్ని రూపొందించుకోవటానికి తోడ్పడుతుంది. అవి అచ్చం ఆయా ఫొటోల్లోని వ్యక్తులే కదులుతున్న భావన కలిగిస్తుంది. ముఖంలో ఆనందం, విచారం వంటి భావాలు కనిపించేలా చేస్తుంది కూడా. ముందుగా ఎలాంటి భావం పలకాలో నిర్ణయించుకొని, దాన్ని ప్రాంప్ట్‌ రూపంలో దీనికి అందించాలి. అనంతరం ఫొటోలో ఆయా భాగాలను ఎంచుకోవాలి. అంతే ఆ భాగానికి చలనం వచ్చేస్తుంది. ఉదాహరణకు- ఫొటోలో వ్యక్తి నవ్వాలని అనుకున్నారనుకోండి. దీనికి తగిన ప్రాంప్ట్‌ను బాక్సులో రాసి, ఫొటోలో ముఖాన్ని ఎంచుకుంటే సరి. అప్పుడది వీడియో మాదిరిగా నవ్వుతూ కనిపిస్తుంది. అంటే కెమెరా, లైట్స్‌ అవసరం లేకుండా మున్ముందు ఫొటోలతోనే యాక్షన్‌ చేయించొచ్చన్నమాట. దీంతో మున్ముందు చిన్న చిన్న సినిమాలు తీసినా ఆశ్చర్యపోనవసరం లేదు. https://runwayml.com/

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని