క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తున్నారా?

స్మార్ట్‌ఫోన్లతో క్యూఆర్‌ కోడ్స్‌ స్కాన్‌ చేయటం మామూలై పోయింది. విమానాలు ఎక్కటానికి, కచేరీల్లోకి ప్రవేశించటానికి, హోటళ్లలో మెనూ చూడటానికి.. ఇలా అన్నిచోట్లా క్యూఆర్‌ కోడ్స్‌ బాగా ఉపయోగపడుతున్నాయి. కానీ స్కామర్లు వీటిని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించుకోవటానికీ వాడుతున్నారనే సంగతి తెలుసా?

Published : 03 Jan 2024 00:07 IST

స్మార్ట్‌ఫోన్లతో క్యూఆర్‌ కోడ్స్‌ స్కాన్‌ చేయటం మామూలై పోయింది. విమానాలు ఎక్కటానికి, కచేరీల్లోకి ప్రవేశించటానికి, హోటళ్లలో మెనూ చూడటానికి.. ఇలా అన్నిచోట్లా క్యూఆర్‌ కోడ్స్‌ బాగా ఉపయోగపడుతున్నాయి. కానీ స్కామర్లు వీటిని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించుకోవటానికీ వాడుతున్నారనే సంగతి తెలుసా? వీటి వెనకాల కనిపించకుండా ప్రమాదకర లింకుల కోడ్స్‌ను పెడుతున్నట్టు సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా హానికర వెబ్‌సైట్లలోకి వెళ్లేలా చేసి, డేటాను సంగ్రహిస్తున్నారని చెబుతున్నారు. వాహనాలను పార్కింగ్‌ చేసే చోట అసలు క్యూఆర్‌ కోడ్స్‌ మీద నకిలీవి అంటించొచ్చు. విశ్వసనీయమైనవని నమ్మించేలా ఈమెయిళ్లకు సందేశాలు పంపించొచ్చు. ఈమెయిల్‌ లేదా టెక్స్ట్‌ సందేశాలకు పంపించే క్యూఆర్‌ కోడ్స్‌ను స్కాన్‌ చేయటం అత్యవసరమని నమ్మించేలా చేస్తుండటమూ గమనార్హం. స్కాన్‌ చేయకపోతే ప్యాకేజీ డెలివరీ కాదనో, ఖాతాలో అనుమానాస్పద సమాచారం ఉందనో, పాస్‌వర్డ్‌ను మార్చుకోవాల్సిన అవసరముందనో చెప్పొచ్చు. ఇలా తక్షణం క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయించి, వెబ్‌సైట్‌లోకి వెళ్లేలా పురికొల్పుతారు. లింకులను క్లిక్‌ చేసి, వెబ్‌సైట్‌లో వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్‌ చేయగానే దాన్ని కొట్టేస్తారు. ముఖ్యంగా మొబైల్‌ ఫోన్లు వాడేవారు ఇలాంటి దాడులకు గురవుతుంటారు. డెస్క్‌టాప్‌ కంప్యూటర్లతో పోలిస్తే మొబైల్‌ ఫోన్లలో భద్రత, రక్షణ తక్కువ. మాల్వేర్లను పరికరంలోకి జొప్పించటానికీ నేరగాళ్లు క్యూఆర్‌ కోడ్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. వీటితోనూ వ్యక్తిగత సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిది.

  • తెలియని కాంటాక్టుల నుంచి వచ్చే క్యూఆర్‌ కోడ్లను స్కాన్‌ చేయొద్దు. లింకులను ఓపెన్‌ చేయొద్దు. డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేయొద్దు. ముఖ్యంగా వెంటనే స్కాన్‌ చేయాలనే మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
  • క్యూఆర్‌ కోడ్స్‌తో ముడిపడిన యాప్స్‌ను ఎన్నడూ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. అధీకృత యాప్‌ స్టోర్‌ల నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • టూఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ విధిగా వాడుకోవాలి. ఇది ఆన్‌లైన్‌లో వ్యక్తుల ధ్రువీకరణకు తోడ్పడుతుంది.
  • ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. దీంతో పరికరానికి తాజా సెక్యూరిటీ ఫీచర్లు అందుతాయి. భద్రంగా ఉంటాయి.
  • క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, లింకును ఓపెన్‌ చేసినప్పుడూ వెబ్‌ చిరునామాను ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి. యూఆర్‌ఎల్‌ విశ్వసనీయమైనదిగా కనిపించినా అక్షరాలు అటూఇటూ మారాయేమో, ఏదైనా అక్షరం తప్పిపోయిందో చూసుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని