Jio Laptop: విండోస్‌ 10తో ‘జియో బుక్‌’.‌. ఊహించిన దాని కంటే ముందే!

ల్యాప్‌టాప్‌ తయారీలో రిలయన్స్‌ జియో మరో అడుగు ముందుకేసింది. తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు తీసుకొచ్చే పనిలో పడిన ఈ కంపెనీకి..

Updated : 07 Feb 2022 22:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: డిజిటల్‌ ఇండియాలో భాగంగా చౌక ఇంటర్నెట్‌, బడ్జెట్‌ మొబైల్స్‌తో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన  రిలయన్స్‌ జియో..  తాజాగా ల్యాప్‌టాప్‌ తయారీలోనూ మరో అడుగు ముందుకేసింది! తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు తీసుకొచ్చే పనిలో పడిన ఈ కంపెనీకి కీలక ఆమోదం లభించినట్లు సమాచారం.

‘జియో బుక్‌’ పేరిట సరసమైన ధరల్లో జియో ల్యాప్‌టాప్‌లు తీసుకురాబోతోందని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి జియో బుక్‌ హార్డ్‌వేర్‌ ఆమోదం కోసం కంపెనీ దరఖాస్తు చేసుకోగా, గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినట్లు టెక్‌ వర్గాల సమాచారం. ఈ మేరకు ఊహించిన దాని కంటే ముందే త్వరలో భారత విపణిలో జియో బుక్‌ అడుగుపెట్టనుంది. అయితే, ఈ ల్యాప్‌టాప్‌ను విండోస్‌ 10, కొత్త ఏఆర్‌ఎం (ARM) ప్రాసెసర్‌తో తీసుకురానున్నట్లు జియో లిస్టింగ్‌లో పేర్కొంది. ఇంతకు మించి ఎటువంటి స్పెసిఫికేషన్‌లు బయటికి రాకపోవడం గమనార్హం. 

మరోవైపు టాబ్లెట్‌తో పాటు స్మార్ట్‌టీవీని జియో ఈ ఏడాదిలో విడుదల చేయాలని యోచిస్తోంది. విడుదల తేదీ, వాటి ప్రత్యేకతలు ఇంకా అధికారంగా ధ్రువీకరించలేదు. అయితే, ఈ టాబ్లెట్‌ను జియో ఫోన్‌నెక్స్ట్‌ మాదిరి కంపెనీ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్రగతిఓఎస్‌తో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక టీవీ విషయానికొస్తే ప్రముఖ ఓటీటీ యాప్‌లు, జియో ఫైబర్‌ సెట్‌-టాప్‌ బాక్స్‌ మద్దతుతో రానున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని