Samsung Balance Mouse: ఎక్కువసేపు పనిచేస్తే.. ఈ మౌజ్‌ మీకందదు!

శాంసంగ్‌ సంస్థ బ్యాలెన్స్‌ మౌస్‌ పేరుతో కంప్యూటర్‌ మౌస్‌ను పరిచయం చేయనుంది. ఉద్యోగులు తమ డ్యూటీ టైమ్‌ తర్వాత కూడా పనిచేయాలనుకుంటే ఈ మౌస్‌ పనిచేయదు...

Updated : 17 Sep 2022 11:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంపెనీలు పెట్టే టార్గెట్‌ సకాలంలో పూర్తి చేసేందుకు కొంత మంది ఉద్యోగులు ఓవర్‌టైమ్‌ పనిచేస్తుంటారు. ఈ క్రమంలో ఒత్తిడికి లోనవుతుంటారు. అంతేకాదు, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేయలేకపోతారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉపయోగపడేలా శాంసంగ్‌ కంపెనీ కొత్త డివైజ్‌ను అభివృద్ధి చేస్తోంది. శాంసంగ్‌ బ్యాలెన్స్‌ మౌజ్‌ (Samsung Balance Mouse) పేరుతో కంప్యూటర్‌ మౌజ్‌ను పరిచయం చేయనుంది. ఉద్యోగులు తమ డ్యూటీ టైమ్‌ తర్వాత కూడా పనిచేయాలనుకుంటే ఈ మౌజ్‌ పనిచేయదు. ఒకవేళ మౌజ్‌ను చేతితో తాకేందుకు ప్రయత్నిస్తే ఉద్యోగి చేతికి చిక్కకుండా పక్కకు జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియోను శాంసంగ్‌ సంస్థ తమ కొరియన్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో విడుదల చేసింది.

ఇందులో ఆఫీస్‌ టైమ్‌ తర్వాత కూడా పనిచేసేందుకు యూజర్‌ మౌజ్‌పై చేతిని ఉంచేందుకు ప్రయత్నిస్తాడు. అప్పటి వరకు మౌజ్‌లా ఉన్న డివైజ్‌లోంచి చెవులు, తోక బయటకు వచ్చి పక్కకు జరుగుతుంది. అలా మౌజ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ చేతికి అందకుండా ముందుకు, పక్కకు జరుగుతూ పోతుంది. దీంతో యూజర్‌ దాన్ని బలవంతంగా పట్టుకుంటాడు. వెంటనే మౌజ్‌ పైభాగం చేతిలో ఉండి కింది భాగం దూరంగా వెళ్లిపోతుంది. దీంతో యూజర్‌కు తన పనివేళలు ముగిశాయని గుర్తుచేసినట్లు అవుతుందని శాంసంగ్‌ చెబుతోంది.  మౌజ్‌ పక్కకు జరిగేందుకు వీలుగా ఇందులో చక్రాలను అమర్చారు.  అలానే యూజర్‌ చేతిని గుర్తించేందుకు బ్యాలెన్స్‌ మౌజ్‌లో సెన్సర్లు ఉన్నాయి. మౌజ్‌కు యూజర్‌ వర్క్‌టైమ్‌ ముగిసిందని ఎలా తెలుస్తుందనే దానిపై స్పష్టత లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ మౌజ్‌ను త్వరలోనే బహిరంగ మార్కెట్లోకి విడుదల చేస్తారని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని