Published : 03/12/2021 02:56 IST

ఇది మొదటి ప్రమాద హెచ్చరిక

మాస్కులే టీకాలుగా పనిచేస్తాయి
రెండు డోసులు తీసుకుంటేనే రక్షణ
జాగ్రత్తగా లేకపోతే ముప్పు తప్పదు
ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు

ఈనాడు- హైదరాబాద్‌: ‘‘ఇది మనకు మొదటి ప్రమాద హెచ్చరిక లాంటిది. మొదటి, రెండోదశ ఉద్ధృతులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా వచ్చాయి. అదృష్టవశాత్తూ దక్షిణాఫ్రికా వేరియంట్‌ గురించి ముందే తెలిసింది. అందువల్ల అన్ని రకాల కొవిడ్‌ నిబంధనలను పాటించడం ద్వారా ఈ ముప్పు నుంచి బయటపడొచ్చు’’ అని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. ముప్పు ఎప్పుడైనా రావొచ్చనీ, మనం తీసుకునే జాగ్రత్తలే మనకు శ్రీరామరక్షగా ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు కూడా సహకరించి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మన మాస్కే వ్యాక్సిన్‌ లాగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంకా రెండోడోసు తీసుకోని వ్యక్తులు సుమారు 25 లక్షలమంది ఉన్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా హైదరాబాద్‌లో 5.90 లక్షల మంది, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 4.89 లక్షలు, రంగారెడ్డిలో 4.15 లక్షల మంది గడువు తీరినా రెండోడోసు వేసుకోలేదని పేర్కొన్నారు. రెండు డోసులు వేసుకుంటేనే కొవిడ్‌ నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని, అప్రమత్తంగా లేకపోతే మూడోముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో గురువారం విలేకరులతో ప్రజారోగ్య సంచాలకులు మాట్లాడారు.


వైరస్‌ కనుమరుగు కాలేదు

‘‘వ్యాక్సిన్‌ ఈరోజు వేసుకున్నంత మాత్రాన రేపటినుంచి మనకు రక్షణ దొరికే అవకాశం లేదు. రక్షణ లభించడానికి సుమారు 2-4 వారాల సమయం పడుతుంది. జనవరి, ఫిబ్రవరిల్లో మరో దశ ఉధ్ధృతి రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇదే నిజం అయ్యే ప్రమాదముంది. ఎందుకంటే కరోనా వైరస్‌ ప్రవర్తన.. ప్రజల ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటుంది. మళ్లీ మన అనాలోచిత చర్యల వల్ల అలాంటి పరిస్థితులు పునరావృత్తం కానీయొద్దు. 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. శుభకార్యాలు, వివాహాలు, ఇతరత్రా ఏ కార్యక్రమాల్లోనైనా కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. వైరస్‌ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ఇప్పటికే మనం చూశాం. ఉదాహరణకు ఒక పాఠశాలలో తొలిరోజు ఒక కేసు వెలుగులోకి వస్తే.. మరుసటి రోజు పరీక్షల్లో 48 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈరోజు ఒక జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి కూడా కొవిడ్‌ సోకింది. మొన్ననే శాసనసభ స్పీకర్‌ కూడా పాజిటివ్‌గా తేలారు. దీన్నిబట్టి వైరస్‌ ఇంకా కనుమరుగు కాలేదనేది స్పష్టమవుతోంది. టీకా తీసుకోకపోతే మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లో నెట్టుకున్నట్లే.  


మాస్కు లేకుంటే రూ. 1000 జరిమానా

మాస్కు ధరించని వారిపై రూ.1000 జరిమానా విధించాల్సిందిగా పోలీసు వారిని కోరాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం గతంలోనే జారీ చేసింది. వచ్చే 2, 3 నెలలు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరిస్తే... మూడోదశ ఉధ్ధృతి రాకుండా అడ్డుకోవచ్చు. అన్ని రకాల పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లో టీకా ధ్రువపత్రాన్ని కూడా ఆరోగ్య సిబ్బంది పరిశీలిస్తారు. అందరూ రెండు డోసులు తీసుకున్నట్లుగా ధ్రువపత్రాన్ని తమ వెంట తీసుకెళ్లాలి. రానున్న రోజుల్లో ధ్రువపత్రం వెంట తీసుకెళ్లడాన్ని తప్పనిసరి చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించనున్నాం’’ అని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని