ఇంటర్‌ పరీక్షల్లో మరో తప్పు

ఇంటర్‌ పరీక్షల సందర్భంగా బోర్డు దోషాలు దొర్లుతూనే ఉన్నాయి. ప్రశ్నపత్రాల్లో రోజుకో కొత్త తరహా తప్పులు వస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు.

Published : 13 May 2022 04:53 IST

ఆంగ్ల, తెలుగు మాధ్యమాల పత్రాల్లో మారిన ప్రశ్న

‘తెలుగు’ విద్యార్థులు దేనికి జవాబు రాసినా మార్కులిస్తామన్న ఇంటర్‌ బోర్డు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షల సందర్భంగా బోర్డు దోషాలు దొర్లుతూనే ఉన్నాయి. ప్రశ్నపత్రాల్లో రోజుకో కొత్త తరహా తప్పులు వస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పనలో ఇంటర్‌బోర్డు ఈసారి తీవ్ర నిర్లక్ష్యం చూపినట్లు స్పష్టమవుతోంది. ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులకు గురువారం గణితం, వృక్షశాస్త్రం, రాజనీతిశాస్త్రం సబ్జెక్టుల పరీక్షలు జరిగాయి. మాధ్యమం ఏదైనా ప్రశ్నలు ఒకటే ఉంటాయి. ఈసారి మాత్రం రాజనీతి శాస్త్రంలో ఒక ప్రశ్న ఆంగ్ల మాధ్యమంలో ఒకటి ఉండగా.. తెలుగు మాధ్యమంలో మాత్రం మరో ప్రశ్న వచ్చింది. ఇవి 5 మార్కుల ప్రశ్నలు కావడం గమనార్హం. వాస్తవానికి ఇది అనువాదంలో పొరపాటు కాదు. ఏకంగా ప్రశ్నే మారిపోయింది. అంటే ప్రశ్నపత్రాల రూపకల్పన, ముద్రణకు ఇచ్చే ముందు పరిశీలించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపినట్లు అర్థమవుతోంది. పరీక్ష జరుగుతున్న సమయంలో బోర్డు తప్పును గుర్తించినా.. ప్రశ్నల్లో తప్పులేదు కాబట్టి ఏ మాధ్యమం వారు ఆ ప్రశ్నపత్రంలోని ప్రశ్నకు జవాబు రాసుకుంటారని అధికారులు భావించి.. ఎరాటా(తప్పుల సవరణ) కూడా పంపలేదని తెలిసింది.

ఇవీ ప్రశ్నలు
ఆంగ్ల మాధ్యమంలో 8వ ప్రశ్న: 1947 భారత స్వాతంత్య్ర చట్టంలోని ముఖ్యాంశాలను రాయండి.
తెలుగు మాధ్యమంలో 8వ ప్రశ్న: భారత స్వాతంత్య్ర పోరాటంలో హోంరూల్‌ ఉద్యమాన్ని వర్ణించండి.

ఏ ప్రశ్నకు రాసినా మార్కులు ఇస్తారట!
తెలుగు మాధ్యమం విద్యార్థులు తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమం ప్రశ్నపత్రాల్లోని 8వ ప్రశ్నకు దేనికి జవాబు రాసినా మార్కులు ఇస్తామని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. వాస్తవానికి ప్రశ్నపత్రం ఒక మాధ్యమంలోనే ఉంటుంది. అంటే తెలుగు మాధ్యమం వారికి ఆంగ్ల మాధ్యమంలో విభిన్న ప్రశ్న ఉన్నట్లు తెలియదు. ఇంటర్‌బోర్డు కూడా తప్పు ఉన్నట్లు.. పరీక్ష రాసే సమయంలో చెప్పలేదు. అందువల్ల విద్యార్థులకు 8వ ప్రశ్న వేర్వేరుగా ఉన్నట్లు తెలియదు. మరి ఇంటర్‌బోర్డు ఎలా ప్రకటించిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

12 మందిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసులు
రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన ద్వితీయ ఇంటర్‌ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడుతున్న 12 మందిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు