Published : 07/12/2021 04:34 IST

ఎర మొక్కలుంటే.. మిరప దక్కేది

ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు
పురుగులు, తెగుళ్లతో నష్టాల పాలు
చేల చుట్టూ బంతి మొక్కలుంటే పంటను కాపాడుకోవచ్చు
తెగుళ్లపై భారత వ్యవసాయ పరిశోధన మండలి అధ్యయనం

భద్రాద్రి జిల్లాలో మిరప తోటను పరిశీలిస్తున్న ఐసీఏఆర్‌ శాస్త్రవేత్తలు

ఈనాడు, హైదరాబాద్‌: ఒకప్పుడు మిరప చేలకు వెళితే చుట్టూ గట్టుపై బంతి లేదా జొన్న, మొక్కజొన్న వరసలు కనిపించేది. ఇప్పుడు అవి కనిపించడం లేదు. చేను చుట్టూ సహజ రక్షణ కోసం ఇలాంటి సహజ  కంచెలు వేయడంలో రైతులు చూపుతున్న నిర్లక్ష్యమే ఇప్పుడు పంటలను కబళిస్తోందని ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’ (ఐసీఏఆర్‌) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిరప, పత్తి, పసుపు, మొక్కజొన్న తదితర పంటలకు పురుగులు, తెగుళ్లు సోకకుండా వాటి చుట్టూ ఎరగా ఇతర మొక్కల సాగు మంచి ఫలితాలనిస్తుంది. ఏవైనా పురుగులు వస్తే తొలుత ఈ మొక్కలపై చేరతాయి. రైతులు వాటిని గుర్తించి నియంత్రించడం ద్వారా అసలు పంటను కాపాడుకోవచ్చు. మిరప రైతులు ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎకరా కౌలుకు రూ.30 వేలకు పైగా చెల్లించి ఈ పంట వేస్తే తెగుళ్లతో పంట దెబ్బతిని నిలువునా నష్టపోతున్నారు. తామర పురుగుతో పాటు కొత్త రకం తెగుళ్లు సోకి మిరప చెట్లు పూత, కాత లేక నాశనమవుతున్నాయని వారు చెబుతున్నారు. అప్పుల పాలై ఆవేదనతో మిరప తోటలను దున్నేస్తున్నారు. రాష్ట్ర ఉద్యానశాఖ సూచనల మేరకు ఐసీఏఆర్‌కు చెందిన బెంగళూరులోని ‘భారత ఉద్యాన పరిశోధనా సంస్థ’(ఐఐహెచ్‌ఆర్‌) శాస్త్రవేత్తలు తెలంగాణలోని పలు జిల్లాల్లో తెగుళ్లు సోకిన మిరప తోటలపై అధ్యయనం చేశారు. ఈ తెగుళ్లకు ప్రధాన కారణం సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడమేనని వారు స్పష్టంచేశారు. వచ్చే ఏడాది మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన అధికారులతో కలసి జాతీయ శాస్త్రవేత్తలు మిరప సాగుపై రైతులకు శిక్షణ ఇస్తామని ఉద్యానశాఖ రాష్ట్ర సంచాలకుడు ఎల్‌.వెంకట్రాంరెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. నర్సరీలు పెట్టి మిరప నారు పెంచుతున్న వ్యాపారులకు కూడా శిక్షణ అవసరమని జాతీయ శాస్త్రవేత్తలు సిఫారసు చేశారని తెలిపారు. తెగుళ్ల నివారణకు వారు గుర్తించిన అంశాలపై ఐసీఏఆర్‌కు నివేదిక పంపారు.

నివేదికలో ముఖ్యాంశాలు...

రాష్ట్రంలో మిరప ఆకు ముడతకు కారణమైన పురుగులు ఆగ్నేయాసియా దేశాల నుంచి వచ్చినవని అనుమానిస్తున్నారు. నిర్ధరణ కోసం నమూనాలు సేకరించి ‘జాతీయ వ్యవసాయ కీటక వనరుల పరిశోధనా మండలి’కి పంపారు. గత జూన్‌ నుంచి నవంబరు వరకు రాష్ట్రంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నమోదయ్యాయి. తెగుళ్లు సోకడానికి ఇవే ప్రధాన కారణం. దీనిపై శాస్త్రీయ అధ్యయనానికి వాతావరణ సమాచారాన్ని సమగ్రంగా ఐఐహెచ్‌ఆర్‌కు రాష్ట్ర ఉద్యానశాఖ పంపాలి.

ప్రతి మిరపతోట చుట్టూ రెండు వరసల బంతి, సజ్జ, మొక్కజొన్న, జొన్న మొక్కల్లో ఏదో ఒకటి కచ్చితంగా రెండు వరసలు నాటాలి. మిరప నాటేందుకు 20 రోజుల ముందే వీటిని నాటాలి. కిలోకు 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌ రసాయనంతో మిరప విత్తనాలను శుద్ధి చేశాకే నారు పెంచాలి. మిరప నాట్లు వేశాక 15 రోజులకు నేలలో ఎకరానికి 8 కిలోల చొప్పున ‘ఫిప్రోనిల్‌’ 10 జీ గుళికలను వేయాలి. వేప చెక్కను ఎకరానికి 250 కిలోలు వేయాలి. లీటరు నీటిలో 3 గ్రాముల కాపరాక్సీక్లోరైడ్‌ చొప్పున కలిపి మిరప చెట్టు వేళ్ల వద్ద వేయాలి. పది రోజుల దాకా నీరు పెట్టవద్దు. ప్రస్తుతం తోటలో తెగుళ్లు సోకిన కొమ్మలను కత్తిరించి తగులబెట్టాలి.

మొక్కకు మొక్కకు మధ్య కనీసం 60 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాట్లు వేయాలి. మొక్కలు ఏపుగా పెరుగుతాయని అధికంగా యూరియా వేస్తున్నారు. అలా వేయడం వల్ల పురుగులు, తెగుళ్లు అధికంగా సోకుతున్నాయి. భూసార పరీక్షలు చేయించి అవసరాన్ని బట్టి మాత్రమే యూరియా వేయాలి. మిరప నాట్లు వేసేముందు అదే పొలంలో జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పైర్లు వేసి మిరప నాట్లకు ముందు కలియదున్నితే భూమికి అవసరమైన పోషకాలు అందుతాయి. మిరపపొలాలకు  కాల్వల ద్వారా నీరు పెట్టడం వల్ల అధిక తేమతో తెగుళ్లు సోకుతున్నాయి. బిందుసేద్యం విధానంలో నీరివ్వడం మంచిది.  తెగుళ్లు సోకాయనే అనుమానంతో విపరీతంగా రసాయన పురుగుమందులు చల్లడం మానేయాలి.

జింకు, బోరాన్‌, మాంగనీసు వంటి సూక్ష్మపోషకాలను రైతులు వాడటం లేదు. వీటిని కచ్చితంగా వినియోగించాలి.

మిరప కోతలు కోసే ముందు కచ్చితంగా నెల ముందు నుంచే రసాయన పురుగుమందులు వాడకం ఆపివేయాలి.  

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని