వేతనాల్లో వ్యత్యాసాలను సవరించాలి

గ్రూప్‌-1 పోస్టుల వేతనాల్లో వ్యత్యాసాలను సవరించాలని, ఆ పోస్టుల్లో పనిచేసే వారికి సమాన వేతనాలు ఇవ్వాలని తెలంగాణ గ్రూప్‌-1 అధికారుల సంఘం రాష్ట్ర పీఆర్‌సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను కోరింది.

Published : 09 May 2024 03:52 IST

రాష్ట్ర గ్రూప్‌-1 అధికారుల సంఘం వినతి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1 పోస్టుల వేతనాల్లో వ్యత్యాసాలను సవరించాలని, ఆ పోస్టుల్లో పనిచేసే వారికి సమాన వేతనాలు ఇవ్వాలని తెలంగాణ గ్రూప్‌-1 అధికారుల సంఘం రాష్ట్ర పీఆర్‌సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌, హన్మంతునాయక్‌ ఇతర నేతలు బుధవారం శివశంకర్‌ను బీఆర్‌కే భవన్‌లో కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ఇస్తున్నట్లు మూడు కేటగిరీల్లో వేతనాల చెల్లింపు కాకుండా గ్రూప్‌-1 ద్వారా ఎంపికైన వారందరికీ ఒకే రకమైన వేతనాలు ఇవ్వాలన్నారు. గ్రూప్‌-1 అధికారులతో తెలంగాణ పరిపాలన సేవావిభాగం (అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌) ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా నియమించాలని అభ్యర్థించారు. నిర్ణీత కాలపరిమితితో పదోన్నతులు కల్పించాలని, సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, 2004కు ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు.

ఈ-కుబేర్‌ను రద్దుచేయాలి: టీఆర్‌టీఎఫ్‌

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల బిల్లుల చెల్లింపుల కోసం ఆర్థిక శాఖలో ఏర్పాటు చేసిన ఈ-కుబేర్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, పెండింగు బిల్లులు ట్రెజరీ నుంచి బ్యాంకులకు వెళ్లగానే చెల్లింపులు జరిపే విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య (టీఆర్‌టీఎఫ్‌) పీఆర్సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను కోరింది.  సంఘం గౌరవాధ్యక్షుడు ఎం.ప్రతాపరెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్‌, కె.అశోక్‌కుమార్‌లు, ఇతర నేతలు బుధవారం శివశంకర్‌కు తమ ప్రతిపాదనలు సమర్పించారు.

పే స్కేల్‌ పెంచాలి: సచివాలయ ఏఎస్‌వోలు

తమకు సూపరింటెండెంట్‌ స్థాయి పే స్కేల్‌ కల్పించాలని సచివాలయ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు శివశంకర్‌ను కోరారు. సెక్షన్‌ ఆఫీసర్లకు డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి పే స్కేల్‌ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏఎస్‌వోలు చలపతిరెడ్డి, దిలీప్‌, భూపాల్‌రెడ్డి, సింధూరి, గౌతమి బుధవారం శివశంకర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని