కాంగ్రెస్‌ సామాజిక మాధ్యమ కార్యదర్శులపై.. కఠిన చర్యలు తీసుకోకుండా దిల్లీ పోలీసులను ఆదేశించండి

దిల్లీలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో దర్యాప్తు పేరుతో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) సామాజిక మాధ్యమ రాష్ట్ర కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకోకుండా దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ పీసీసీ హైకోర్టును ఆశ్రయించింది.

Published : 09 May 2024 03:50 IST

 హైకోర్టులో పీసీసీ పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో దర్యాప్తు పేరుతో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) సామాజిక మాధ్యమ రాష్ట్ర కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకోకుండా దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ పీసీసీ హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు పేరుతో సామాజిక మాధ్యమ కార్యదర్శుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడాన్ని సవాల్‌ చేస్తూ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా కాంగ్రెస్‌ విజయాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నాం. అయితే దిల్లీ పోలీసులమంటూ 150 మంది దాకా వచ్చి ఇక్కడ సామాజిక మాధ్యమ కార్యదర్శుల పనుల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మార్ఫింగ్‌ వీడియోను పోస్టు చేశారంటూ ప్రభుత్వ ఉద్యోగి శింకుశరణ్‌ సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు ఇక్కడ ఇళ్లలోకి వచ్చి పార్టీకి చెందినవారిని, వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంమంత్రి రిజర్వేషన్లను రద్దుచేస్తామని ప్రసంగించారంటూ వక్రీకరించి వీడియోను పెట్టారని ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కొంతమందిని మే 3న అరెస్ట్‌ చేయగా, బెయిలుపై విడుదలయ్యారు. ఒకే రకమైన కేసుకు సంబంధించి అక్రమంగా నిర్బంధించాలని చూస్తున్నారు. మణికొండలోని కాంగ్రెస్‌ కన్సల్టెంట్‌గా ఉన్న మంద శ్రీప్రతాప్‌ ఫ్లాట్‌లోకి 15 నుంచి 20 మంది దిల్లీ పోలీసులు వెళ్లి పలు వస్తువులను నిబంధనలకు విరుద్ధంగా సీజ్‌ చేశారు. ఇక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దిల్లీ పోలీసులు అక్రమంగా ఇళ్లలోకి ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సాక్షులుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దర్యాప్తు పేరుతో నిర్బంధించే ప్రయత్నాలు చేస్తున్నారు. దర్యాప్తు పేరుతో కఠిన చర్యలు తీసుకోకుండా, అదేవిధంగా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలి’’ అని పిటిషన్‌లో కోరారు. ఇందులో ప్రతివాదులుగా రాష్ట్ర హోంశాఖ, డీజీపీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, దిల్లీ ఎస్‌హెచ్‌వో, ప్రభుత్వ ఉద్యోగులు మీరాజ్‌, శింకుశరణ్‌ సింగ్‌లను చేర్చారు. ఈ పిటిషన్‌పై గురువారం వేసవి సెలవుల హైకోర్టు బెంచ్‌ విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని