మత్తు దందాపై ఆబ్కారీ నిఘా..!

మత్తు దందాపై ఆబ్కారీశాఖ నిఘా తీవ్రతరం చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మాదకద్రవ్యాల రవాణా ముఠాలు, సారా తయారీ స్థావరాలు, సుంకం చెల్లించని మద్యం విక్రయాలపై దాడులు ముమ్మరం చేసింది.

Published : 09 May 2024 03:58 IST

4 నెలల్లో రూ.39.15 కోట్ల విలువైన సారా స్వాధీనం
రూ.7.2 కోట్ల విలువైన మాదకద్రవ్యాల జప్తు
ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నిఘా తీవ్రతరం

ఈనాడు, హైదరాబాద్‌: మత్తు దందాపై ఆబ్కారీశాఖ నిఘా తీవ్రతరం చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మాదకద్రవ్యాల రవాణా ముఠాలు, సారా తయారీ స్థావరాలు, సుంకం చెల్లించని మద్యం విక్రయాలపై దాడులు ముమ్మరం చేసింది. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి నేతృత్వంలోని బృందాలు నాలుగు నెలలుగా జరిపిన దాడుల్లో ఏకంగా రూ.39.15 కోట్ల విలువైన సారా, దాని తయారీ పదార్థాలతోపాటు రూ.7.2 కోట్ల విలువైన గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను జప్తు చేశారు. ఇందులో ఒక్క ఏప్రిల్‌లోనే రూ.33.5 కోట్ల విలువైన సరకును పట్టుకున్నారు. 4 నెలల్లో మొత్తం 9,145 కేసుల్లో 4,010 మందిని నిందితులుగా గుర్తించారు.

సారా.. కల్తీకల్లు నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ

ఎన్నికల నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా తయారవుతున్న సారా స్థావరాలపై ఆబ్కారీశాఖ 350 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా విస్తృతం చేసింది. గత 4 నెలల్లో రూ.8.27 కోట్ల విలువైన సారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతోపాటు 593 వాహనాలను జప్తు చేశారు. కల్తీ కల్లు తయారీకి వినియోగించే రూ.28.28 లక్షల విలువైన 565.5 కిలోల క్లోరల్‌హైడ్రేట్‌, రూ.54.63 లక్షల విలువైన 5.463 కిలోల ఆల్ప్రాజోలం, రూ.3.04 లక్షల విలువైన 1.52 కిలోల డైజోపాంను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని