దేశంలోనే అత్యుత్తమ పంటల బీమా పథకం తెస్తాం

‘‘గడిచిన ఐదేళ్లుగా కేసీఆర్‌ అనుసరించిన విధానాలు రైతులకు అనుకూలంగా లేవు. కఠినతర నిబంధనలతో రైతులందరికీ పంటల బీమా వర్తించలేదు.

Published : 09 May 2024 03:51 IST

పూర్తిస్థాయి బడ్జెట్‌ తర్వాత రూ.15 వేల చొప్పున రైతుభరోసా చెల్లింపులు
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: ‘‘గడిచిన ఐదేళ్లుగా కేసీఆర్‌ అనుసరించిన విధానాలు రైతులకు అనుకూలంగా లేవు. కఠినతర నిబంధనలతో రైతులందరికీ పంటల బీమా వర్తించలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిబంధనలను సడలించి రైతులందరికీ బీమా ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. భారతదేశంలోనే అత్యంత మంచి పంటల బీమా పథకాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. జూన్‌ నుంచి ఎలాంటి నష్టం జరిగినా బీమా సంస్థలే బాధ్యత వహించేలా మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ప్రకారం జూన్‌లో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌ తర్వాత రైతుభరోసా కింద రూ.15 వేలు చెల్లిస్తాం’’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘రెండు రోజులుగా కురిసిన వర్షాలకు రైతులు అధైర్యపడవద్దు. ధాన్యాన్ని ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. రైతుల సంక్షేమానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్కోటి అమలు చేస్తున్నాం. పంట రుణమాఫీ ఆగస్టు 15 నాటికి తప్పక పూర్తి చేస్తాం. రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ చేయడానికి గత ప్రభుత్వానికి ఆరు నెలలు పట్టింది.. మూడు నెలల్లోనే మేము నూరుశాతం చెల్లించాం. వర్షాలతో సంబంధం లేకుండా విత్తనాలు సరఫరా చేసేలా అధికారులకు ఆదేశాలిచ్చాం. ఎరువులు, విత్తనాల కోసం రైతులు నిరీక్షించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించాం’’ అని తుమ్మల చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని