సంక్షిప్త వార్తలు (6)

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఐదోతరగతిలో ప్రవేశాలకు తొలివిడత కౌన్సెలింగ్‌ ఇటీవల ముగిసింది.

Updated : 09 May 2024 05:40 IST

ముగిసిన ఐదో తరగతి తొలివిడత కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఐదోతరగతిలో ప్రవేశాలకు తొలివిడత కౌన్సెలింగ్‌ ఇటీవల ముగిసింది. తొలివిడతలో దాదాపు 90 శాతానికి పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు సమాచారం. రాష్ట్రంలో 643 ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 51,924 సీట్లు ఉండగా, 1.13 లక్షల మంది విద్యార్థులు ప్రవేశపరీక్ష రాశారు. విద్యార్థికి ఏ పాఠశాలలో సీటు కేటాయిస్తున్నామో తెలియజేస్తూ ఎలాట్‌మెంట్‌ ఆర్డర్లను ఎస్సీ గురుకుల సొసైటీ ఇచ్చింది. తొలివిడత సీట్ల భర్తీ ముగిసిన వెంటనే మిగిలిన సీట్లకు రెండోవిడత ప్రవేశాలు నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది.


గవర్నర్‌కు కాగ్‌ నివేదిక అందజేత

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ పద్దులపై ఆడిట్‌ నివేదికను కంప్ట్రోలర్‌, ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) కార్యాలయం అధికారులు బుధవారం గవర్నర్‌కు అందజేశారు. ఈ మేరకు కాగ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ ఆదాయ, వ్యయాలు, బడ్జెట్‌పై ఆడిట్‌ నివేదికలను అందజేశారు.


ఈఏపీసెట్‌కు 91.67 శాతం హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ ఈఏపీసెట్‌కు రెండోరోజు బుధవారం 91.67 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన వ్యవసాయ, ఫార్మసీ పరీక్షకు మొత్తం 33,427 మందికి 30,641 మంది పరీక్షలు రాసినట్లు సెట్‌ కన్వీనర్‌ తెలిపారు.


నారాయణపూర్‌ నుంచి నీటి విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని తాగునీటి అవసరాలకుగాను బుధవారం కర్ణాటకలోని నారాయణపూర్‌ జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. కర్ణాటకలోని రాయిచూర్‌ థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రానికి ఒక టీఎంసీని విడుదల చేసిన ఆ రాష్ట్రం తెలంగాణకు ఇవ్వనున్న నీటిని విడతల వారీగా వదిలినట్లు ఇంజినీర్లు తెలిపారు. గురు, శుక్రవారాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని జూరాల ప్రాజెక్టుకు ఈ నీరు చేరుకుంటుందని పేర్కొన్నారు.


ఇద్దరు ఎస్‌ఈలకు సీఈలుగా పదోన్నతులు

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖలో ఇద్దరు పర్యవేక్షక ఇంజినీర్లకు ముఖ్య ఇంజినీర్లుగా పదోన్నతి కల్పిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి ఎస్‌ఈ ఎ.మురళీధర్‌కు పదోన్నతి కల్పిస్తూ మంచిర్యాల సీఈగా నియమించారు. ఇక్కడి సీఈగా ఉన్న జి.శ్రీనివాస్‌ రెడ్డి ఇటీవల పదవీ విరమణ పొందడంతో ఖాళీ ఏర్పడింది. జగిత్యాల ఎస్‌ఈ జి.అశోక్‌కుమార్‌కు పదోన్నతి అనంతరం వరంగల్‌ సీఈగా నియమించారు. ఇక్కడ సీఈగా పనిచేసిన ఎం.విష్ణు ప్రసాద్‌ ఇటీవల పదవీ విరమణ పొందారు. ఇటీవల కార్యనిర్వాహక ఇంజినీర్ల పదవీ విరమణతో ఖాళీ అయిన ఎనిమిది పోస్టుల్లో అదనపు బాధ్యతలతో ఈఈలను నియమించారు.


మొక్కజొన్న సాగు విస్తరించాలి

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా మొక్కజొన్నల సాగు పెరగాలని, వరి, పత్తిలకు ప్రత్యామ్నాయంగా దీన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, లూథియానా భారత మొక్కజొన్న పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయ ఆవరణలో 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం బుధవారం ప్రారంభమైంది. 32 సంస్థల నుంచి 140 మంది మొక్కజొన్న శాస్త్రవేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జాతీయ మొక్కజొన్న పరిశోధనల మండలి డైరెక్టర్‌ హెచ్‌ఎస్‌ జాట్‌, ఏడీసీ ప్రథాన్‌, సీనియర్‌ శాస్త్రవేత్త సైందాస్‌, విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు రఘురామిరెడ్డిలు ఈ సందర్భంగా ప్రసంగించారు. మొక్కజొన్న సాగుపై అన్నదాతల్లో చైతన్యం తేవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని