EAMCET: ఆగస్టు 5-9 వరకు ఎంసెట్‌!

రాష్ట్రంలో ఎంసెట్‌ను ఆగస్టు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అయిదు రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఎంసెట్‌తో పాటు ఆగస్టు 3న ఈసెట్‌, అదే నెల 11-14 తేదీల్లో పీజీఈసెట్‌ నిర్వహించాలని నివేదించినట్లు తెలిసింది.

Updated : 17 Jun 2021 12:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంసెట్‌ను ఆగస్టు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అయిదు రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఎంసెట్‌తో పాటు ఆగస్టు 3న ఈసెట్‌, అదే నెల 11-14 తేదీల్లో పీజీఈసెట్‌ నిర్వహించాలని నివేదించినట్లు తెలిసింది. వాస్తవానికి జూన్‌ 19-22 వరకు పీజీఈసెట్‌, జులై 1న ఈసెట్‌, జులై 5-9వ తేదీ వరకు ఎంసెట్‌ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి గత ఫిబ్రవరిలో నిర్ణయించింది. కరోనా పరిస్థితుల కారణంగా జులై వరకు వద్దనుకున్న అధికారులు వాటిని ఆగస్టులో నిర్వహించాలని కొద్ది రోజుల క్రితమే ప్రాథమికంగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ పరీక్షలను నిర్వహించే టీసీఎస్‌ డిజిటల్‌ అయాన్‌ ప్రతినిధులతో చర్చించిన అధికారులు తేదీలను ఖరారు చేసి విద్యాశాఖ మంత్రికి సమర్పించారు. జాతీయ పరీక్షలైన జేఈఈ మెయిన్‌ తదితర పరీక్షలను కూడా టీసీఎస్‌ డిజిటల్‌ అయానే నిర్వహిస్తున్నందున వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలోని పరీక్షల తేదీలను వారు సూచించారని చెబుతున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నత విద్యామండలి ప్రతిపాదించిన తేదీలకు ఆమోదం తెలపనుందని భావిస్తున్నారు.

అవి యథాతథం!
ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్‌, 23న లాసెట్‌, 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్‌ను నిర్వహిస్తామని గతంలోనే ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దానివల్ల వాటి తేదీలను మార్చాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు.

జేఈఈ మెయిన్‌ జులై నెలాఖరులో?
వాయిదా పడిన జేఈఈ మెయిన్‌ మూడో విడత పరీక్షలు జులై నెలాఖరులో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జేఈఈ మెయిన్‌ను నిర్వహించాలంటే అన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ క్రమంలో జులై మూడో వారానికి అన్ని రాష్ట్రాల్లో పరీక్షలను నిర్వహించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడవచ్చని కేంద్రం అంచనాకు వచ్చిందని, అందుకే జాతీయ న్యాయ విద్య విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు(క్లాట్‌)ను జులై 23వ తేదీన నిర్వహించాలని న్యాయ వర్సిటీల కన్సార్షియం నిర్ణయించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. జేఈఈ మెయిన్‌ మూడు, నాలుగు విడతలతో పాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ జరపాల్సి ఉన్నందున జులైలో జరిపేందుకు జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులో ఆయా తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెలాఖరుకు పరిస్థితిని అంచనా వేసి...అనుకూలంగా లేకుంటే వాటిని ఆగస్టుకు మార్చేందుకు అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని