PM Modi: పనికిరాని చట్టాలను రద్దు చేయండి

ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో చట్టాలను వివరించాలని,  న్యాయస్థానాల్లో స్థానిక భాషల వినియోగాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సామాన్య ప్రజల జీవితానికి అడ్డంకిగా మారిన పనికిరాని

Updated : 01 May 2022 05:58 IST

కోర్టుల్లో స్థానిక భాషల వినియోగానికి ప్రాధాన్యమివ్వండి
ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ పిలుపు
వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించండి
హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సూచన

ఈనాడు, దిల్లీ: ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో చట్టాలను వివరించాలని,  న్యాయస్థానాల్లో స్థానిక భాషల వినియోగాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సామాన్య ప్రజల జీవితానికి అడ్డంకిగా మారిన పనికిరాని చట్టాల రద్దుకు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శనివారం నిర్వహించిన ముఖ్యమంత్రులు-హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 11వ సంయుక్త సదస్సును ఉద్దేశించి ఆయన కీలక ఉపన్యాసం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1800 నిరుపయోగ చట్టాలను గుర్తించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1,450 చట్టాలను రద్దుచేస్తే, రాష్ట్రాలు 75 చట్టాలకు మాత్రమే మంగళం పలికాయన్నారు. ఇప్పటికైనా పనికిమాలిన చట్టాలను రద్దు చేసి ప్రజల జీవితాలను సరళతరం చేయాలని ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచించారు.

న్యాయస్థానాల్లో మాతృభాషల వినియోగం

జిల్లా స్థాయి నుంచి ఉన్నత కోర్టుల వరకు స్థానిక భాషల వినియోగాన్ని పెంచాలని ప్రధాని మోదీ సూచించారు. అప్పుడే సామాన్యుడికి న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు.‘‘ప్రజలు న్యాయవ్యవస్థలో మమేకంకావాలి. న్యాయమూలాలను ప్రజలు అవగాహన చేసుకుంటేనే న్యాయవ్యవస్థ, రాజ్యవ్యవస్థ ఆదేశాల్లోని వ్యత్యాసాలను తెలుసుకోగలరు. చాలా దేశాల్లో చట్టాల రూపకల్పనలో న్యాయ పరిభాషను ఉపయోగించినప్పటికీ, వాటిని ప్రజలకు అర్థమయ్యేలా చేసేందుకు సరళ భాషలోనూ అందుబాటులోకి తెస్తున్నారు. రాబోయే రోజుల్లో మన దేశంలోనూ చట్టాల గురించి న్యాయ పరిభాషతో పాటు సామాన్యుల భాషలోనూ వివరించే ప్రయత్నం చేస్తామ’’ని ప్రధాని వెల్లడించారు. ‘‘మన దేశంలో ఇప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టుల కార్యకలాపాలు పూర్తిగా ఆంగ్లంలోనే జరుగుతున్నాయి. ఈ పద్ధతి మారాలని ప్రధాన న్యాయమూర్తే స్వయంగా చెప్పడం సంతోషం కల్గించింది’’ అని ప్రధాని అన్నారు. భాషకూడా సామాజిక న్యాయానికి ప్రాతిపదికగా మారుతుందని అభిప్రాయపడ్డారు.


పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారం

దేశంలో 3.50 లక్షల మంది ఖైదీలు విచారణ లేకుండానే జైళ్లలో మగ్గుతున్నారు. జిల్లా జడ్జీల నేతృత్వంలోని కమిటీలు ఈ కేసులను సమీక్షించి వీలైన వారికి బెయిల్‌ మంజూరు చేసి ఉపశమనం కల్పించాలి. న్యాయమూర్తులు ఇలాంటి విషయాలను చట్టం దృష్టితోపాటు మానవీయ కోణంలోనూ చూడాలి. కోర్టుల్లోని పెండింగ్‌ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం కూడా ఒక మార్గం. సమస్యకు సకాలంలో పరిష్కారం లభిస్తే కోర్టులపై భారం తగ్గుతుంది. సామాజిక నిర్మాణం కూడా భద్రంగా ఉంటుంది. ఈ దృష్టితోనే మధ్యవర్తిత్వ బిల్లును తీసుకొచ్చాం.

- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు