దిల్లీ మద్యం కేసులో.. ఎంపీ సోదరుడిని విచారించనున్న ఈడీ!

మద్యం ముడుపుల వ్యవహారంలో ఈడీ కూడా దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది.

Published : 08 Dec 2022 04:59 IST

ఈనాడు, హైదరాబాద్‌ : మద్యం ముడుపుల వ్యవహారంలో ఈడీ కూడా దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన శరత్‌చంద్రారెడ్డిని అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రాబోయే రోజుల్లో మరికొందరిని ప్రశ్నించే అవకాశం ఉందని, ఇందులో ఓ ఎంపీ సోదరుడు కూడా ఉన్నట్లు సమాచారం. మద్యం ముడుపుల కేసులో లబ్ధి చేకూర్చుతానని నిందితులు, అనుమానితులతో బేరమాడారన్న అనుమానంతోనే ఆయనను విచారించాలని దిల్లీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.మద్యం ముడుపుల కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే రాష్ట్రంలో అనేకమార్లు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గోరంట్ల అసోసియేట్స్‌లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా అనేక మందిని దిల్లీ పిలిపించి విచారించారు. దిల్లీ మద్యం వ్యాపారంలో దక్షిణాది లాబీ కీలకపాత్ర పోషించిందని, పెద్దఎత్తున నిధులు చేతులు మారాయని, నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా ఎనిమిది సర్కిళ్లను ఇదే లాబీ దక్కించుకుందని దర్యాప్తులో వెల్లడయింది. ఇందులో భాగంగా ఈడీ అధికారులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు భావిస్తున్న శరత్‌చంద్రారెడ్డిని అరెస్టు చేశారు. ఆయన వాంగ్మూలం కూడా నమోదు చేశారు. ఈ లోపు సీబీఐ అధికారులు రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్సీ కవితకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద నోటీసులు జారీ చేశారు. వచ్చే 11న ఆమెను విచారించనున్నారు. ఇదిలా ఉండగా రాబోయే రోజుల్లో ఈడీ అధికారులు దర్యాప్తు వేగం పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఓ ఎంపీ సోదరుడిని పిలిపించాలని నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారమే ఇందుకు నిదర్శనం. గతంలో ఓ ఎంపీ ఇంట్లో ఆదాయపన్నుశాఖ సోదాలు నిర్వహించినప్పుడు పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ దొరికిందని, దీని వివరాలు తెలుసుకునేందుకు ఇటీవల ఈడీ అధికారులు ఆయన సోదరుడిని పిలిపించి విచారించారని సమాచారం. ప్రస్తుతం మద్యం ముడుపుల కేసులో దిల్లీ ఈడీ అధికారులు విచారణకు పిలిచిన ఎంపీ సోదరుడు, విదేశీ కరెన్సీ విషయంలో విచారణకు హాజరైన వ్యక్తి ఒకరేనా?, వేర్వేరా? అనేది త్వరలోనే తేలనుంది.


అమిత్‌ అరోడా ఈడీ కస్టడీ పొడిగింపు

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అమిత్‌ అరోడా ఈడీ కస్టడీని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరో వారం పొడిగించింది. అక్రమ నగదు చలామణి వ్యతిరేక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అమిత్‌ అరోడాను అరెస్టు చేసిన ఈడీ అధికారులు గత వారం రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా నాడు న్యాయస్థానం ఏడు రోజుల కస్టడీకి ఇచ్చింది. గడువు ముగియడంతో బుధవారం ఈడీ అధికారులు న్యాయస్థానం ఎదుట మరోసారి అరోడాను హాజరుపర్చారు. కేసు దర్యాపు కొనసాగుతోందని, కీలక సమచారం సేకరిస్తున్నందున కస్టడీని మరో పది రోజులు పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. స్పందించిన న్యాయస్థానం కస్టడీని వారం రోజులు పొడిగించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని