JEE Main: మధ్యస్థంగా జేఈఈ మెయిన్‌ ప్రశ్నపత్రాలు..

దేశవ్యాప్తంగా గురువారం జేఈఈ మెయిన్‌ చివరి విడత ప్రారంభం కాగా తొలిరోజు ప్రశ్నపత్రాల స్థాయి మధ్యస్థంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Updated : 07 Apr 2023 08:31 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా గురువారం జేఈఈ మెయిన్‌ చివరి విడత ప్రారంభం కాగా తొలిరోజు ప్రశ్నపత్రాల స్థాయి మధ్యస్థంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తం మీద జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్‌ తరహాలోనే గణితంలో మంచి ప్రమాణాలతో కూడిన ప్రశ్నలు ఇచ్చారని చెబుతున్నారు. కఠినం కాకపోయినా ఎక్కువ సమయం పట్టే ప్రశ్నలున్నాయన్నారు. వాటికి జవాబులు గుర్తించాలంటే మూడు గంటల సమయంలో గంటన్నరపాటు పడుతుందని వారు విశ్లేషిస్తున్నారు. గణితంలోని 25 ప్రశ్నల్లో ఆరు చాలా సులభంగా ఉన్నందున వాటిని అందరూ చేస్తారని, 10 ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నాయని శ్రీచైతన్య అఖిల భారత ఐఐటీ సమన్వయకర్త ఎం.ఉమాశంకర్‌ తెలిపారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే వారు మంచి స్కోర్‌ చేస్తారని, ఎక్కువ మందికి 300కి 300 మార్కులు రాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. భౌతికశాస్త్రంలో ఎక్కువగా ఫార్ములా ఆధారిత ప్రశ్నలు ఇచ్చారని, ఎక్కువ మంది 12 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తారన్నారు. 3-4 ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌లోని థియరీ నుంచి ఇచ్చారని, మొత్తం మీద భౌతికశాస్త్రం సులభంగా ఉందని చెబుతున్నారు. రసాయన శాస్త్రంలో ఆర్గానిక్‌, ఇన్‌ఆర్గానిక్‌ ప్రశ్నలు సమానంగా ఇచ్చారు. ఈ సబ్జెక్టులో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారని, కొన్ని విద్యార్థులను తికమక పెట్టేవిగా ఉన్నాయని ఉమాశంకర్‌ తెలిపారు. టాపర్లు 290కిపైగా, మధ్యస్థంగా ఉన్న విద్యార్థులు 150కిపైగా మార్కులు సాధిస్తారని ఆయన అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని