కరీంనగర్‌లో శ్రీవారి కోవెల

కరీంనగర్‌లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరనున్నారు. సువిశాలమైన 10 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయాన్ని అద్భుత క్షేత్రంగా నిర్మించాలని తితిదే సంకల్పించింది.

Published : 01 Jun 2023 03:38 IST

తితిదే ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: కరీంనగర్‌లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరనున్నారు. సువిశాలమైన 10 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయాన్ని అద్భుత క్షేత్రంగా నిర్మించాలని తితిదే సంకల్పించింది. కరీంనగర్‌ పద్మానగర్‌లో ఆలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజ, శంకుస్థాపన పూర్తిచేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, తితిదే ఛైర్మన్‌ డాక్టర్‌ వై.వి.సుబ్బారెడ్డిల సమక్షంలో నాలుగు వేదాల శిలలతోపాటు గర్భగుడి శిలకు వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు, హోమం నిర్వహించారు. శ్రీవారి కృపతోనే కరీంనగర్‌లో దేవాలయ నిర్మాణం సాకారమవుతోందని మంత్రి గంగుల అన్నారు. దేవదేవుడి కోనేరును తలపించే పురాతన బావి, చింతచెట్టు ఉండటమే ఈ స్థల వైభవాన్ని తెలియజేస్తుందన్నారు. అడగ్గానే స్పందించి.. ఆలయ నిర్మాణానికి అనుమతించిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

రూ. 20 కోట్లతో నిర్మిస్తాం..

తితిదే ఛైర్మన్‌ డాక్టర్‌ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి మంత్రి గంగుల, వినోద్‌కుమార్‌, ఎంపీ దీవకొండ దామోదర్‌రావు, తితిదే స్థానిక సలహా మండలి కమిటీ ఛైర్మన్‌ భాస్కర్‌రావు అభ్యర్థించారని.. కేసీఆర్‌ విజ్ఞాపనతో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇక్కడ రూ.20 కోట్లతో దేవాలయం నిర్మిస్తామన్నారు. తిరుమల మాదిరి క్రతువులన్నీ నిర్వహిస్తామని తెలిపారు. తితిదే వేద పండితులు ఇక్కడే ఉంటారని, పోటు ద్వారా ప్రసాదాలను సైతం ఇక్కడే తయారు చేస్తారన్నారు. కార్యక్రమంలో దామోదర్‌రావు, భాస్కర్‌రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌, పాడి కౌశిక్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌, సీఈవో ప్రియాంక, పోలీసు కమిషనర్‌ సుబ్బారాయుడు, దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ చంద్రశేఖర్‌, కార్పొరేషన్‌ ఛైర్మన్లు రవీందర్‌సింగ్‌, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, అనిల్‌ కుర్మాచలం, మేయర్‌ సునీల్‌రావు దంపతులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని