హైకోర్టులో తొలి తెలుగు తీర్పు

తెలుగులో తొలి తీర్పు వెలువరించడం ద్వారా తెలంగాణ హైకోర్టు చరిత్ర సృష్టించింది. తల్లి ఆస్తిలో వాటాకు సంబంధించి దాఖలైన అప్పీలుపై సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ నగేష్‌ భీమపాకలతో కూడిన ధర్మాసనం ఇటీవల తెలుగులో 44 పేజీల తీర్పు వెలువరించింది.

Updated : 30 Jun 2023 04:41 IST

స్థానిక భాషల్లో కేరళ తరువాత తెలంగాణ హైకోర్టులోనే
వీలునామా వ్యాజ్యంలో జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ నగేష్‌ భీమపాకలతో కూడిన ధర్మాసనం చొరవ

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగులో తొలి తీర్పు వెలువరించడం ద్వారా తెలంగాణ హైకోర్టు చరిత్ర సృష్టించింది. తల్లి ఆస్తిలో వాటాకు సంబంధించి దాఖలైన అప్పీలుపై సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ నగేష్‌ భీమపాకలతో కూడిన ధర్మాసనం ఇటీవల తెలుగులో 44 పేజీల తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మొత్తం ఆంగ్ల భాషలోనే వ్యవహారాలుంటాయి. పిటిషన్‌లు దాఖలు చేసినప్పుడు అనుబంధ పత్రాలు, ఆధారాలు స్థానిక భాషలో ఉన్నప్పటికీ వాటిని ఆంగ్లంలోకి తర్జుమా చేసి కోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలి. స్థానిక భాషల ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా కోర్టులు కూడా మాతృభాష వైపు అడుగులు వేయడం ప్రారంభించాయి. సుప్రీం కోర్టు కీలక తీర్పులను ఈ మధ్య స్థానిక భాషల్లోకి తర్జుమా చేయిస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులు కూడా స్థానిక భాషలో తీర్పు వెలువరించడానికి ఆసక్తి చూపుతున్నాయి. స్థానిక భాషల్లో కేరళ తరువాత తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు మలయాళంలో తీర్పు వెలువరించింది.

ఉభయ రాష్ట్రాల్లో కింది కోర్టుల్లో ఒకరిద్దరు మినహా తెలుగులో తీర్పులు వెలువరించిన సంఘటనలు అరుదే. తెలుగులో తీర్పు వెలువరించడం ద్వారా జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ నగేష్‌ భీమపాకలతో కూడిన ధర్మాసనం కొత్త అధ్యాయానికి నాంది పలికింది. కక్షిదారులు, ప్రజల సౌలభ్యం కోసం ఇలా  తెలుగులో వెలువరించామని తీర్పు చివరిలో ధర్మాసనం పేర్కొంది. అధికారిక కార్యకలాపాల నిమిత్తం 41 పేజీల ఆంగ్ల తీర్పునూ వెలువరించింది. తెలుగులో ఏవైనా సందేహాలుంటే వాటి నివృత్తికి ఆంగ్లంలోని తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. కేవలం ఈ కేసుకు సంబంధించిన అంశాలేకాకుండా తమ కేసును రుజువు చేసుకోవడానికి ఇరుపక్షాల న్యాయవాదులు సమర్పించిన సుప్రీం కోర్టు తీర్పులను ధర్మాసనం తెలుగులోకి అనువదించింది. తెలంగాణ హైకోర్టు మాతృభాషలో తీర్పు వెలువరించడం భాషాభిమానులకు ఆనందాన్నిచ్చే అంశమే. భవిష్యత్తులో తెలుగులో మరిన్ని వెలువడటానికి ఇది మొదటి అడుగు.

కింది కోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేం

సికింద్రాబాద్‌కు చెందిన వీరారెడ్డి కుమారులు కె.చంద్రారెడ్డి, ముత్యంరెడ్డి మధ్య తల్లికి చెందిన భూమి పంపక వివాదం కోర్టుకు చేరింది. తల్లి సాలమ్మ మరణం తరువాత ఆమెకు చెందిన 4.08 ఎకరాల భూమికి సంబంధించిన వివాదమిది. అది మొత్తం తనకే చెందుతుందని చంద్రారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా విచారించిన సివిల్‌ కోర్టు తల్లి రాసిన వీలునామాలో సందేహాలున్నాయని తేల్చి చెప్పింది. ఆ వీలునామా చెల్లదని పేర్కొంది. అంతేగాకుండా తల్లి ఆస్తి ఇద్దరికీ సమానంగా చెందుతుందని తేల్చింది. కింది కోర్టు తీర్పుపై చంద్రారెడ్డి అతని వారసులు హైకోర్టులో అప్పీలు చేశారు. ముత్యంరెడ్డి మృతిచెందడంతో వారసులు కేసును కొనసాగించారు. ఇరుపక్షాల వాదనలను విన్న జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ నగేష్‌ భీమపాకలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ కేవలం వీలునామాపై సందేహాలను వ్యక్తం చేయడమేకాకుండా అందుకు స్పష్టమైన కారణాలను కింది కోర్టు పేర్కొందని తెలిపింది. ఆ కోర్టు వెలువరించిన తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ చంద్రారెడ్డి అప్పీలును కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని