TS HighCourt: అధికారులకు షాక్‌ ట్రీట్‌మెంట్‌ అవసరం

హైదరాబాద్‌లోని రామంతాపూర్‌ పెద్దచెరువుతోపాటు ఇతర చెరువుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని గత నెల 13న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ జీహెచ్‌ఎంసీపై హైకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 06 Oct 2023 10:25 IST

చెరువుల రక్షణపై నివేదిక అడిగితే సంతకం లేని కాగితం ఇస్తారా?
జీహెచ్‌ఎంసీపై హైకోర్టు ఆగ్రహం
కమిషనర్‌ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని రామంతాపూర్‌ పెద్దచెరువుతోపాటు ఇతర చెరువుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని గత నెల 13న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ జీహెచ్‌ఎంసీపై హైకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక సమర్పించకపోగా.. రాతపూర్వక వివరణ అంటూ ఎలాంటి సంతకం లేని ఒక ఫొటోకాపీని అందజేయడాన్ని తప్పుబట్టింది. ఒక చెరువేనంటూ ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదంది. అధికారులకు షాక్‌ ట్రీట్‌మెంట్‌ అవసరమని వ్యాఖ్యానించింది. బాధ్యులైనవారు వచ్చి వివరణ ఇవ్వాలని, ఒకవేళ హాజరు కాకపోతే వారెంట్‌ జారీ చేస్తామని హెచ్చరించింది. ఈ నెల 10న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ వ్యక్తిగతంగా హాజరై ఎందుకు నివేదిక సమర్పించలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్‌ నగరంలో 532 చెరువులు, 200 తోటలు క్షీణిస్తున్నాయని.. 25 ఎకరాల్లోని రామంతాపూర్‌ పెద్దచెరువును డంపింగ్‌ యార్డుగా మారుస్తున్నారని, దీంతో జల కాలుష్యం ఏర్పడటంతోపాటు దుర్వాసన వ్యాపిస్తోందంటూ ఉస్మానియా ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె.ఎల్‌.వ్యాస్‌ 2005లో రాసిన లేఖను హైకోర్టు పిటిషన్‌గా స్వీకరించింది.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చెరువుల రక్షణకు చర్యలు చేపడుతున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మూడు శాఖల సమన్వయంతో పనులు చేయాల్సి ఉందని, వారం గడువిస్తే నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ 3 శాఖలైనా, 15 అయినా ఒక్కటేనని.. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. చెరువు రక్షణకు తీసుకుంటున్న చర్యలపై కోరిన నివేదికను సమర్పించకపోగా సంతకం లేని కాగితాన్ని పంపడం సరికాదంది. మరో గత్యంతరం లేక జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హాజరు కావాలని ఆదేశిస్తున్నామంటూ.. విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని