Cyber Crime: ఎన్నికల సందట్లో సైబర్‌ వల.. ఆ లింకులు క్లిక్‌ చేయొద్దు

ఎన్నికల వేళ ఎవరి హడావుడిలో వారుంటే.. సందట్లో సడేమియా అన్నట్లు జాతీయ నాయకులు, పార్టీల పేర్లు వాడుకొని సైబర్‌ నేరగాళ్లు హల్‌చల్‌ చేస్తున్నారు.

Updated : 30 Oct 2023 09:06 IST

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నికల వేళ ఎవరి హడావుడిలో వారుంటే.. సందట్లో సడేమియా అన్నట్లు జాతీయ నాయకులు, పార్టీల పేర్లు వాడుకొని సైబర్‌ నేరగాళ్లు హల్‌చల్‌ చేస్తున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే ఒక సందేశం విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఓ జాతీయ పార్టీ మూడు నెలలు ఉచితంగా ఫోను రీఛార్జ్‌ చేస్తుందంటూ వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో పోస్టులు, సందేశాలు వస్తున్నాయి. ‘ఉచిత రీఛార్జ్‌ కోసం దిగువ చూపిన లింకును గడువులోగా క్లిక్‌ చేసి నమోదు చేసుకోండి’ అని అందులో సూచిస్తున్నారు. దీనికి ఓ పార్టీ అధికారిక వెబ్‌సైటుకు దగ్గరగా ఉండే వెబ్‌ చిరునామా లింకు ఇచ్చారు.

రాష్ట్రమంతా ఎన్నికల సందడి నెలకొనడంతో ఈ సందేశం బాగా వైరల్‌ అవుతోంది. ఇదే సందేశం ఆర్నెల్ల కిందట మార్చిలోనూ వైరల్‌ కాగా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో’ ఫ్యాక్ట్‌ చెక్‌లో అది నిజం కాదని తేల్చారు. ఇప్పటివరకు ఈ లింకులో నమోదు చేసుకొని నష్టపోయినట్లు ఎలాంటి ఘటనలు వెలుగులోకి రాకపోయినా.. ఎన్నికల సమయంలో కొందరైనా మోసపోవడానికి ఆస్కారముంది. ‘‘పండుగల సమయం కూడా కావడంతో అభ్యర్థులు, పార్టీలు వివిధ రకాల రాయితీలు ఇస్తున్నట్లు ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థల పేర్లకు దగ్గరగా ఉండే లింకులతో నమ్మించేందుకు కేటుగాళ్లు ప్రయత్నిస్తారు. వాటిని తెరిస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదముంది. ఈ తరుణంలో పార్టీల పేరిట ఉచితాలు, రాయితీలంటూ వచ్చే సామాజిక మాధ్యమ లింకులతో అప్రమత్తంగా ఉండటం అవసరం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో పార్టీల తరఫున ఇలాంటి బహిరంగ ఆఫర్లు ఇవ్వరన్న విషయం గుర్తించాలి’’అని అధికారులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు