Rajat Kumar: 17 రోజుల్లో ఉద్యోగ విరమణ.. 12 రోజులు జర్మనీ పర్యటన..

కాళేశ్వరం ఎత్తిపోతలలో అధిక నీటి తరలింపునకు వినియోగించే స్టాటిక్‌ ఫ్రీక్వెన్సీ కన్వర్టర్‌(ఎస్‌ఎఫ్‌సీ)ల కొనుగోళ్లకు సంబంధించి తనిఖీలు, పరిశీలనకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఈ నెల 14 నుంచి 25 వరకు జర్మనీ పర్యటనకు వెళ్తున్నారు.

Updated : 14 Nov 2023 08:27 IST

కాళేశ్వరంలో ఏర్పాటు చేసే ఎస్‌ఎఫ్‌సీల తనిఖీకి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతలలో(Kaleshwaram Lift Irrigation Project) అధిక నీటి తరలింపునకు వినియోగించే స్టాటిక్‌ ఫ్రీక్వెన్సీ కన్వర్టర్‌(ఎస్‌ఎఫ్‌సీ)ల కొనుగోళ్లకు సంబంధించి తనిఖీలు, పరిశీలనకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌(Rajat Kumar) ఈ నెల 14 నుంచి 25 వరకు జర్మనీ పర్యటనకు వెళ్తున్నారు. మరోవైపు ఆయన ఈ నెల 30న ఐఏఎస్‌గా ఉద్యోగ విరమణ పొందుతున్నారు. దీనికి పక్షం రోజుల ముందు విదేశీ పర్యటనలో పాల్గొంటుండటం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ నుంచి ఎగువకు రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోసే విధంగా ఇప్పటికే పంపులు, వ్యవస్థ ఉన్నాయి. అయితే మరో టీఎంసీ తరలింపునకు వీలుగా పాత నిర్మాణాలకు సమాంతరంగా అదనపు పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ప్యాకేజీ 1, 4లలో గుత్తేదారు సంస్థలు పంపులు ఏర్పాటు చేస్తున్నాయి. వాటికి సంబంధించి విద్యుత్‌ సరఫరా వ్యవస్థలో వినియోగించే కీలకమైన ఎస్‌ఎఫ్‌సీలను జర్మనీ నుంచి కొనుగోలు చేయనున్నారు. వాటి పరిశీలనకు అధికారుల బృందం జర్మనీలోని న్యురెంబర్గ్‌ వెళ్లేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రజత్‌కుమార్‌తోపాటు ఈఎన్సీ సి.మురళీధర్‌, కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరాం, ఎత్తిపోతల పథకాల సలహాదారుడు కె.పెంటారెడ్డి, సిద్దిపేట ఎస్‌ఈ హెచ్‌.బస్వరాజ్‌, విద్యుత్‌ శాఖ ట్రాన్స్‌కో డైరెక్టర్‌ జె.సూర్యప్రకాశ్‌, సీఈ పి.ఉపేందర్‌ బృందంలో ఉన్నారు. ప్యాకేజీ 1, 4లకు చెందిన ఇద్దరు ప్రతినిధులు కూడా వెళ్తున్నట్లు తెలిసింది. అయితే పలు కారణాలతో ఈఎన్సీ మురళీధర్‌, ఎస్‌ఈ బస్వరాజ్‌, ట్రాన్స్‌కో సీఈ ఉపేందర్‌ నిలిచిపోయినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని