శివారు.. ఫాం ల్యాండ్స్‌ అక్రమాల జోరు

రాజధాని హైదరాబాద్‌ శివారులో వ్యవసాయ క్షేత్రం ఉండటమనేది ఒక స్టేటస్‌ సింబల్‌గా మారింది. వారాంతాల్లో విడిదిగా ఈ క్షేత్రాలను చాలా మంది ఉపయోగించుకుంటున్నారు.

Updated : 09 Apr 2024 07:03 IST

గజాల్లో విక్రయాలు.. గుంటల్లో రిజిస్ట్రేషన్లు
ధరణి నిబంధనల ఆసరాగా వ్యాపారం

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌ శివారులో వ్యవసాయ క్షేత్రం ఉండటమనేది ఒక స్టేటస్‌ సింబల్‌గా మారింది. వారాంతాల్లో విడిదిగా ఈ క్షేత్రాలను చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. కానీ కొందరు ఈ పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్నారు. సాగు భూములను చిన్న చిన్న విస్తీర్ణాలుగా మార్చి ఫాం ల్యాండ్స్‌ పేరిట విక్రయిస్తున్నారు. రూ.40-50 లక్షలు వెచ్చిస్తే చాలు దాదాపు 242 చదరపు గజాల స్థలంలో నివాసం, గ్రీనరీ ఉన్న ఫాం ల్యాండ్‌ సొంతమవుతుందన్న ఆలోచనతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, విదేశాల్లో స్థిరపడిన వారు చాలామంది కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. ఓ వైపు వ్యాపారులు సాగు భూమిని సాగేతర భూమిగా చూపి కొనుగోలుదారులకు అంటగడుతుండగా మరోవైపు ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఈ తరహా వ్యాపారం పెద్దఎత్తున సాగుతోంది. దీన్ని కట్టడి చేయకపోతే భవిష్యత్‌లో టౌన్‌ ప్లానింగ్‌ సమస్యలు ఏర్పడతాయి. ధరణి పోర్టల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లలో రెండు, మూడు నెలలుగా గుంటల్లో జరుగుతున్నవే ఎక్కువగా ఉంటున్నాయి.

60 కిలోమీటర్ల పరిధిలోనే ఎక్కువగా..

నగరానికి 60 కిలోమీటర్ల పరిధిలోనే ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌లకు దారితీసే ప్రధాన రహదారుల్లోని మండలాల్లో ఈ క్షేత్రాలు వెలుస్తున్నాయి. సాగు భూమిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు రోడ్లు, విద్యుత్‌ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. గుంట, రెండు గుంటల విస్తీర్ణాన్ని ప్లాట్‌గా మార్చుతున్నారు. ఒక మూలన సకల వసతులతో చిన్నపాటి ఇంటిని నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల కంటెయినర్‌లను పెడుతున్నారు. ఖాళీ స్థలంలో మామిడి, జామ, కొబ్బరి మొక్కలు పెంచుతున్నారు. కొన్ని చోట్ల అప్పటికే తోటలు ఉంటే చెట్ల మధ్య వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎకరా భూమిని రూ.రెండు, మూడు కోట్లకు కొనుగోలు చేసి గజం సుమారు రూ.20 వేలకు పైగా ధరకు విక్రయిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి పన్నులేవీ ఉండకపోగా.. వ్యాపారులకు కనీసం రూ.రెండింతలు మిగులు ఉంటోందన్న అంచనాలు ఉన్నాయి.

వెసులుబాటు కల్పిస్తున్న ధరణి

గుంట భూమిని కూడా రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌ చేసే వెసులుబాటును ధరణి పోర్టల్‌ కల్పిస్తుండటం ఈ వ్యాపారానికి కలిసి వస్తోంది. అయితే, ఆ భూమిని గజాలుగా మార్చి(121 చ.గజాలు) విక్రయిస్తున్నారు. వాస్తవానికి నాలా పన్ను చెల్లించి స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయాలంటే పక్కాగా లేఅవుట్‌ ప్లాన్‌, అనుమతులు ఉండాలి. అందుకే ఇవేమీ లేకుండా గుంటల్లో అంటకడుతున్నారు. పైగా పాసుపుస్తకం, ప్రభుత్వం ఇచ్చే పంట పెట్టుబడి వస్తుందని భరోసా ఇస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన నాలా, రిజిస్ట్రేషన్‌ పన్ను ఆదాయానికి గండిపడుతోంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగిస్తే మ్యుటేషన్‌ చేయకూడదు. కానీ 2020 నవంబరు నుంచి అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్‌ ఏకకాలంలో రిజిస్ట్రేషన్‌- మ్యుటేషన్‌లకు అనుమతిస్తోంది. క్షేత్రస్థాయిలో భూమి పరిశీలన చేయకుండానే మ్యుటేషన్‌ పూర్తవుతుండటం ఫాం ల్యాండ్స్‌ వ్యాపారానికి కలిసి వస్తోంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

సాగు భూమిని నాలా అనుమతి పొందాకే సాగేతర రంగాలకు వినియోగించాలి. పంచాయతీ, డీటీసీపీ నుంచి లే అవుట్‌ అనుమతి పొందాలి. స్థలంలో పది శాతం గ్రీన్‌బెల్ట్‌కు, సామాజిక అవసరాలకు వదలాలి. ఆ భూమి విస్తీర్ణం బట్టి ప్రధాన రహదారి, అంతర్గత రహదారుల నిర్మాణం ప్రమాణాల మేరకు చేపట్టాలి. డ్రైనేజీ మార్గం నిర్మించాలి. ఫాం ల్యాండ్స్‌లలో ఇవేమీ ఉండవు. భవిష్యత్‌లో ఆవాస ప్రాంతంగా మారిన తరువాత లే అవుట్‌ ఇబ్బందులు, ప్లానింగ్‌ సమస్యలు వస్తాయనే విషయం తెలియక చాలా మంది కొనుగోలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని