మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు

రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్‌ ఆదేశించారు.

Published : 23 Apr 2024 04:03 IST

అంతరాయం ఉన్న ప్రాంతాల్లో సత్వర చర్యలు
సమీక్షలో సీఎస్‌ శాంతికుమారి

ఈనాడు,హైదరాబాద్‌: రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్‌ ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితులపై పంచాయతీరాజ్‌, పురపాలక, నీటిపారుదల ముఖ్య కార్యదర్శులు సందీప్‌ సుల్తానియా, దాన కిశోర్‌,  రాహుల్‌ బొజ్జా, ఇతర ఉన్నతాధికారులతో ఆమె సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. నీటి సరఫరా పరిస్థితులను మిషన్‌భగీరథ, పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నాగార్జునసాగర్‌ నుంచి ఇప్పటికే నీటి పంపింగ్‌ ప్రారంభమైందని, మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను హెచ్చరించారు. నగరంలో సీజీఎంల ముందస్తు అనుమతితోనే  నిర్వహణ పనులు చేపట్టాలని, ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. దీనిపై అధికారులు ప్రతిరోజూ తమ పరిధిలోని మేనేజర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించాలన్నారు. సీడీఎంఏ దివ్య మాట్లాడుతూ మంచినీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని, లీకేజీలను వెంటనే సరిచేస్తున్నామన్నారు. ప్రతి పురపాలికలో హెల్ప్‌లైన్‌ ను ఏర్పాటు చేశామని, సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని