Governor Tamilisai: అత్యున్నత పదవిలో ఉన్న మహిళలూ వివక్షకు గురవుతున్నారు

సమాజంలో మహిళలు ఇప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారని, వారికి సరైన గౌరవం దక్కడం లేదని, అత్యున్నత పదవిలో ఉన్న మహిళలూ అందుకు మినహాయింపు కాదని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. తాము సమాన హక్కులను డిమాండ్‌ చేస్తున్నప్పటికీ,

Updated : 08 Mar 2022 04:52 IST

నేను దేనికీ¨ భయపడను.. నన్నెవరూ భయపెట్టలేరు: గవర్నర్‌ తమిళిసై

ఈనాడు, హైదరాబాద్‌: సమాజంలో మహిళలు ఇప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారని, వారికి సరైన గౌరవం దక్కడం లేదని, అత్యున్నత పదవిలో ఉన్న మహిళలూ అందుకు మినహాయింపు కాదని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. తాము సమాన హక్కులను డిమాండ్‌ చేస్తున్నప్పటికీ, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమన్నారు. భారతీయ మహిళ ఎవరికీ భయపడదని, తానూ దేనికీ భయపడనని, తననెవరూ భయపెట్టలేరని చెప్పారు. సోమవారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవాల్లో ఆమె ప్రసంగించారు. ‘ప్రతి మహిళా ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. దేని కోసం కూడా ఆనందాన్ని వదులుకోకూడదు. నిరాశ, నిస్పృహలో కూరుకుపోకుండా ఏదైనా సాధించాలనే తపనతో సవాళ్లతో కూడిన పనులు చేపట్టి రాణించాలి. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ నూతనోత్సహంతో ముందుకు సాగాలి. ఏ స్త్రీ తన స్వార్థం కోసం ఏదీ కోరుకోదు. ప్రతిదీ తన కుటుంబం కోసమే ఆలోచిస్తుంది. తమిళనాడు మహిళలకు, తెలంగాణ స్త్రీలకు తేడా ఏంటని.. ఇటీవల నన్ను ఓ ఇంటర్వ్యూలో అడిగారు. అందరూ ఒకేలా ఉంటారని చెప్పాను. తెలంగాణ సోదరిగా నేను ఇక్కడి మహిళల జీవన విధానాన్ని ఎంతగానో ఇష్టపడతాను. మహిళలను గుర్తించి, గౌరవించి, వారి కృషిని, అద్భుత విజయాలను జరుపుకునేందుకు ప్రతిరోజూ మహిళా దినోత్సవం కావాలి’’ అని గవర్నర్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.శ్రీ సుధ, జస్టిస్‌ రాధారాణి, జస్టిస్‌ మాధవీదేవి, ఎమ్మెల్యే సీతక్క, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, ఉపమేయర్‌ శ్రీలతారెడ్డి, పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులను, వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని గవర్నర్‌ సత్కరించారు. 

40 మందికి ప్రభుత్వ పురస్కారాలు

ఈనాడు, హైదరాబాద్‌: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో గుర్తింపు పొందిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పురస్కారాలు ఇవ్వనుంది. ఈ మేరకు 2021-22కు సంబంధించి 40 మందితో కూడిన జాబితాను సోమవారం విడుదల చేసింది. వీరికి రూ.లక్ష చొప్పున అందించనున్నారు. జాబితాలో ప్రముఖ విద్యావేత్త ప్రొ.లక్ష్మిరెడ్డి, తెలంగాణ మహిళా భద్రత విభాగం డీఐజీ బడుగుల సుమతి, ప్రముఖ జర్నలిస్ట్‌ ఉమాసుధీర్‌, రమాదేవి లంకా, వాసిరెడ్డి కాశీరత్నం తదితరులున్నారు.

యాదాద్రి అద్భుతంగా ఉంది: గవర్నర్‌

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌ ప్రజలందరికీ లబ్ధి చేకూరేలా ఉండాలని గవర్నర్‌ తమిళిసై ఆకాంక్షించారు. బడ్జెట్‌ సమావేశాల ఆరంభం రోజు గవర్నర్‌ పుణ్యక్షేత్రమైన యాదాద్రి సందర్శించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా తెలంగాణ ప్రజలతో మమేకమై పని చేశానన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం బ్రహ్మాండంగా ఉందని, సంపూర్ణంగా కృష్ణశిలతో నిర్మించడం అద్భుతమని చెప్పారు. దీనిని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తొలుత ప్రధానాలయ పనులను పరిశీలించారు. గర్భాలయంలోని మూలవరులను దర్శించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని