china: సరిహద్దులకు సమీపంలో చైనా మొబైల్‌ టవర్లు..!

వాస్తవాధీన రేఖ వద్ద చైనా వేగంగా నిర్మాణాలు చేపడుతోంది. తాజాగా పాంగాంగ్‌ సరస్సుపై అక్రమ వంతెన నిర్మాణం తుది దశకు చేరింది. మరో వైపు  మూడు మొబైల్‌ టవర్లను ఏర్పాటు చేయడం గమనార్హం

Published : 17 Apr 2022 15:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాస్తవాధీన రేఖ వద్ద చైనా వేగంగా నిర్మాణాలు చేపడుతోంది. తాజాగా పాంగాంగ్‌ సరస్సుపై చేపట్టిన అక్రమ వంతెన నిర్మాణం తుది దశకు చేరింది. మరో వైపు  మూడు మొబైల్‌ టవర్లను కూడా ఎల్‌ఏసీ వద్ద ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ విషయాన్ని చుషూల్‌ కౌన్సిలర్‌ కొంచెక్‌ స్టాంజిన్‌ వెల్లడించారు. ‘‘ చైనా దళాలు పాంగాంగ్‌ సరస్సుపై వంతెన నిర్మాణం పూర్తి చేశాయి. ఆ తర్వాత హాట్‌స్ప్రింగ్స్ వద్ద మూడు మొబైల్‌ టవర్లను నిర్మించాయి. ఇవి భారత్‌ భూభాగానికి చాలా సమీపంలో ఉన్నాయి. ఇది ఆందోళనకరం కాదా..? ఇక్కడ మాకు కనీసం 4జీ సౌకర్యాలు కూడా లేవు. నా పరిధిలోని 11 గ్రామాలకు ఇప్పటికీ 4జీ సౌకర్యం లేదు’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ పార్లమెంట్‌లో మాట్లాడుతూ లద్ధాఖ్‌ సమీపంలోని చైనా ఆక్రమణలను ఏ మాత్రం అంగీకరించమని వెల్లడించారు. పాంగాంగ్‌ వద్ద వంతెన నిర్మిస్తున్న ప్రాంతం 1962 నుంచి చైనా ఆక్రమణలో ఉందని వెల్లడించారు. ఇటీవల కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  మాట్లాడుతూ ‘‘వారు ఏం చేశారో .. మేము ఏం నిర్ణయాలు తీసుకొన్నామో చెప్పను. కానీ, భారత్‌ ఎటువంటి నష్టాన్ని సహించదన్న సందేశం చైనాకు చేరింది’’ అన్నారు. 

2020 మే నెలలో భారత్‌-చైనా మధ్య తూర్పు లద్ధాఖ్‌ ప్రాంతంలో ఘర్షణలు మొదలయ్యాయి. గల్వాన్‌ ఘటన తర్వాత భారత్‌-చైనాలు సైనిక కమాండర్ల స్థాయిలో 15 సార్లు చర్చలు జరిపాయి. కానీ, ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని